Idream media
Idream media
కాలం విలువైనది మాత్రమే కాదు. అదీ.. ఇదీ అనే తేడా లేకుండా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. గుణపాఠం చెబుతుంది.. అనుభవాన్ని ఇస్తుంది… తిట్టిన వారి చేతే పొగిడిస్తుంది. కాలానికి మించిన స్నేహితుడు, మార్గదర్శి, శతృవు ఎవరూ ఉండరని కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషించిన వారే నేడు.. ఆయన్ను పొగుడుతున్నారు. అవినీతి పరుడు అన్న వారే.. నేడు ఆయన చూపిన దారిలో నడవాలని పిలుపునిస్తున్నారు.
ఈ రోజు వైఎస్సార్ 72వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవల్ని, పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వైఎస్సార్ జయంతి నిర్వహించారు. కొత్తగా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి.. వైఎస్సార్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేస్తూ.. ఆయన వ్యక్తిత్వాన్ని, పాలనను పొగుడుతుంటే.. వైఎస్సార్ అభిమానులకు చరిత్ర గుర్తుకు వస్తోంది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా.. వైఎస్సార్‌ని దూషించారు. ఆయన మరణించిన తర్వాత కూడా దూషణలు చేశారు.
వైఎస్సార్ పట్ల అలా ఉన్న రేవంత్ రెడ్డి.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత… వైఎస్సార్ పట్ల వైఖరి పూర్తిగా మారిపోయింది. ‘‘ రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రైతు రణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ గారికే దక్కుతుంది. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి. నేడు రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానేతను మరోసారి స్మరించుకుందాం. ఆయన చూపిన దారిలో నడుస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం.. జోహార్ వైఎస్సార్..’’ అంటూ వైఎస్సార్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగం సాగింది. అందుకే అంటారు కాలం ఎంతో గొప్పదని.
Also Read : కాంగ్రెస్ కురువృద్ధుడు అస్తమయం