iDreamPost
android-app
ios-app

రేవంత్‌ మారాలట.. వారికి ఇంకా అర్థం కాలేదా..?

రేవంత్‌ మారాలట.. వారికి ఇంకా అర్థం కాలేదా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరుచుకుంది. అంతర్గత కుమ్ములాటల వల్లనే పంజాబ్‌లో ఓటమి పాలయ్యామని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ పరిణామం తర్వాత మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి వల్ల నష్టం జరిగే పరిస్థితి రానీయకూడదని హస్తం పెద్దలు గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణలో పార్టీ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరుతో అర్థమవుతోంది.

పీసీసీ అధ్యక్షుడికి,రాష్ట్ర ఇంఛార్జికి వ్యతిరేకంగా చాలాకాలంగా గళం వినిపిస్తున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డిపై నిన్నమొన్నటి వరకు చూసీచూడనట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు.. ఇటీవల ఏకంగా ఆయనపై వేటు వేశారు. ఏకంగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవితోపాటు ఇతర పార్టీ పదవుల నుంచి తప్పించడం సంచలనమైంది. దీంతోపాటు రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నేతలు.. ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారికి అపాయింట్మెంట్‌ దక్కలేదు.కనీసం పార్టీ ముఖ్యనేతలు వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌లు ఫోన్లు కూడా ఎత్తలేదు.

పరిస్థితి ఇలా ఉంటే.. ఇంకా కొంతమంది సీనియర్‌ నేతలకు విషయం బోధపడనట్లుగా ఉంది. అందులో మొదటిస్థానంలో సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్‌ హనుమంతరావు ఉన్నారు.ఓ పక్క అసమ్మతి ఉండకూడదని కాంగ్రెస్‌ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. రేవంత్‌ రెడ్డికి బలమైన మద్ధతు ఇస్తుంటే.. వీహెచ్‌ మాత్రం.. రేవంత్‌ రెడ్డి మారాలంటూ సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు.. పీసీసీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నెల 31 నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వీహెచ్‌ సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్‌ కూడా పాల్గొంటారని కూడా చెబుతున్నారు.

మెప్పుకోసం తిప్పలు..

రేవంత్‌ రెడ్డి అసమ్మతి వర్గంలో వీహెచ్‌ హనుమంతరావు కూడా ఒకరు. ఇటీవల కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరుతో నిర్వహించిన సమావేశంలో వీహెచ్‌ కూడా పాల్గొన్నారు. అయితే దూకుడుగా వెళ్లే జగ్గారెడ్డి ఈ సమావేశం వల్ల వేటుకు గురయ్యారు. సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌ ఇతరులు మెల్లగా జారుకున్నారు. వీహెచ్‌ మళ్లీ అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు తాను బలమైన నేతను అని చెప్పుకునేందుకు.. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోకుండా చూస్తున్నానంటూ మాట్లాడుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు, అయితే వారిని తాను ఆపుతున్నట్లుగా వీహెచ్‌ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఇలాంటి టిక్కులకు కాలం చెల్లిందనే విషయం వీహెచ్‌కు ఎప్పుటికి అర్థం అవుతుందో?