iDreamPost
android-app
ios-app

నేడే రేవంత్‌ పీసీసీ బాధ్యతలు.. సీనియర్ల సహకారం ఉండేనా?

నేడే రేవంత్‌ పీసీసీ బాధ్యతలు.. సీనియర్ల సహకారం ఉండేనా?

తెలంగాణ కాంగ్రెస్‌లో నూతన శకం ప్రారంభం కానుంది. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రమాణస్వీకారానికి వెళ్లే జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడిలో పూజలు, నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ నియామకంపై ఇప్పటికీ కొందరు అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీలోని చాలా మది సీనియర్‌ నాయకులు రేవంత్‌కు తప్పా పీసీసీ చీఫ్‌ ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చాలా సందర్భాల్లో బహిరంగంగానే పేర్కొన్నారు. కొందరైతే లేఖల ద్వారా కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటినేమీ పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌ హైకమాండ్‌ రేవంత్‌కే టీపీసీసీ కట్టబెట్టింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కొందరు బహిరంగంగా, ఇంకొందరు అంతర్గతంగా అసంతృప్తిని వెళ్లగక్కారు.

అయితే, పార్టీ సీనియర్లను కలుస్తూ వస్తున్న రేవంత్‌రెడ్డి.. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ తాజా మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసానికీ వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. తొలుత మర్రి శశిధర్‌రెడ్డి నివాసానికి రేవంత్‌ వెళ్లారు. రేవంత్‌ను శశిధర్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నివాసానికి వెళ్లారు. రేవంత్‌కు భట్టి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇద్దరూ 45 నిముషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇక అంతర్గత కలహాలు ఉండబోవని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అందించినట్లే రేవంత్‌రెడ్డికీ సహకారం అందిస్తానన్నారు. బుధవారం తన నివాసానికి వచ్చిన రేవంత్‌ను అభినందించి.. స్వీటు తినిపించారు. జగ్గారెడ్డి భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలను, కుమార్తె జయారెడ్డిని, కుమారుడిని రేవంత్‌రెడ్డి పలకరించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామాల క్రమంలో సీనియర్ల సహకారం రేవంత్‌ కు నిజంగానే ఉంటుందా, ఎంపీ కోమటిరెడ్డి సంగతేంటి? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ సారథ్యంలో టీ.కాంగ్రెస్‌ రథం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.