iDreamPost
android-app
ios-app

తెలంగాణ పీసీసీ.. మ‌ళ్లీ పేచీ..!

తెలంగాణ పీసీసీ.. మ‌ళ్లీ పేచీ..!

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి దాదాపు ఖ‌రార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీలో మ‌ళ్లీ లొల్లి ప్రారంభ‌మైంది. ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు నిరస‌న గ‌ళం విప్పుతున్నారు. దాదాపు ఆరు నెల‌లు కాలంగా పార్టీలో ఇదే తంతు కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ అధిష్ఠానం దీనికి చెక్ పెట్ట‌లేక‌పోతోంది. ధైర్యంగా అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించ‌లేక‌పోతోంది. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ చందంగా… టీపీసీసీ ఎంపిక పార్టీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేస్తోంది. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల్సిన త‌రుణంలో, టీపీసీసీ పీఠం ఖాళీ కావ‌డం, దాని కోసం పోటీ పెర‌గ‌డం.. నేత‌ల మ‌ధ్య విభేదాల‌ను సృష్టిస్తోంది.

తాజాగా ఎంపీ వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీపి నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తుంటే, త‌న‌కు ఫోన్ లు చేసి ఆయ‌న అనుచ‌రులుగా చెప్పుకుంటున్న కొంద‌రు బూతులు తిడుతున్నారన్నారు. ఇలాంటి ఘటనను జానారెడ్డి ఒక్కడే ఖండించారు.. ఉత్తమ్, భట్టి అసలు స్పందించలేదని ఆరోపించారు.

వైఎస్ ను తిట్టినా…మాకు కడప నుండి బెదిరింపులు రాలేదని.. రేవంత్ పెద్ద నాయకుడు అంటారని.. గ్రేటర్ లో ఎన్ని గెలిపించాడని ప్రశ్నించారు. సాగర్ లో జానారెడ్డికి పెద్ద కొడుకు అన్నావు.. హుజూర్ నగర్ లో ఉత్తమ్ సతీమణినీ గెలిపించే బాధ్యత నాది అన్నాడని రేవంత్ పై ఫైర్ అయ్యారు. పిసిసి బీసీలకు ఇవ్వండి లేకపోతే.. కోమటిరెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మాత్రం విభిన్న పంథాలో స్పందించారు. పాము చావ‌కుండా, క‌ర్ర విర‌క్కుండా సేవా మార్గం ద్వారా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వ్యక్త‌ప‌రిచారు. ప్రభుత్వమే చేయలేని ఎన్నో పనుల్ని తాను పీసీసీ చీఫ్ అయి ఉంటే చేసి ఉండేవాడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గుర్తుగా ఉస్మానియా.. గాంధీ ఆసుపత్రుల వద్ద రెండేసి చొప్పున మొత్తం నాలుగు అంబులెన్సుల్ని ఈ సర్కారు దవాఖానాల వద్ద ఏర్పాటు చేశారు. పేదలు.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారు తాను ఏర్పాటు చేసిన అంబులెన్సుల్ని వాడుకోవాలన్న ఆయన.. తనను కానీ పీసీసీ చీఫ్ ను చేసి ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇదే తరహా అంబులెన్సుల్ని ఏర్పాటు చేసే వాడినని చెప్పారు. ఎంత ఖర్చు అయినా ఫర్లేదు.. అంబులెన్సుల్ని గ్రామాలకు తీసుకెళ్లటమే తన లక్ష్యమని చెప్పారు.