Idream media
Idream media
కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. టీఆర్‌ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ గా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ వేడి చల్లారకముందే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ రాజకీయ అగ్గిని రాజేసింది. మంత్రి జగదీశ్‌రెడ్డిపైన కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైన ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రేవంత్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ట్వీట్‌కు అనుబంధంగా ఓ పత్రిక కథనం
టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా కొన్ని పేర్లను తగిలిస్తూ ట్వీట్ చేశారు. ‘‘రసకందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్‌రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..?!’’ అంటూ ట్విటర్‌లో రేవంత్ పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కు అనుబంధంగా ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్నీ పోస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో మంత్రి జగదీశ్‌రెడ్డి కుమారుడి పుట్టినరోజు వేడుకలు కర్ణాటకలోని హంపిలో జరిగాయని, పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు, నామినేటెడ్ పోస్టులో కొనసాగిన ఓ వ్యక్తి ఈ వేడుకకు హాజరయ్యారని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ నాయకత్వంపై, ఆయన కుటుంబం పెత్తనంపై అనుచిత వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయని ప్రచురించింది.
జగదీశ్‌రెడ్డి లక్ష్యంగా
మంత్రి కేటీఆర్ సీఎం అయితే.. ఈటల రాజేందర్ సొంతంగా పార్టీ పెట్టే అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపైనా చర్చ జరిగినట్లు తెలిపింది. అంతేకాకుండా.. పార్టీ ప్రస్తుత పరిస్థితి, కేటీఆర్ సీఎం అయ్యాక ఏమవుతుంది అన్నదానిపై ఓ ఎమ్మెల్యే పాట కూడా పాడారని, మంత్రి జగదీశ్‌రెడ్డి దీనిని వారించకుండా మౌనంగా ఉన్నారని పేర్కొంది. ఈ వ్యవహారం సీఎం కార్యాలయానికి చేరిందని ఆ కథనంలో ఉంది. అయితే రేవంత్‌రెడ్డి తన ట్వీట్‌లో.. రస, క్రాంతి, ఘంటా అనే పదాలకు కోట్స్ వాడుతూ, జగదీశ్‌రెడ్డి పేరును మాత్రం నేరుగానే ప్రస్తావించారు. ఈ ట్వీట్‌పై రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది.
చిల్లర ఎత్తుగడ అంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణిల పేర్లనే రేవంత్ పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈటల రాజేందర్ తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డికే సీఎం కేసీఆర్ గంట కట్టబోతున్నారన్నది రేవంత్‌రెడ్డి ట్వీట్‌తోపాటు ఆ పత్రిక కథనం సారాంశమని అంటున్నారు. అయితే టీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం ఆ కథనాన్ని, రేవంత్ ట్వీట్‌ను కొట్టి పారేస్తున్నాయి. రేవంత్ ట్వీట్‌పై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్పందిస్తూ, ‘‘ఇది చిల్లర ఎత్తుగడ. పాపం ‘దందా’ నడవక చాలా రోజులు అయినట్టుంది’ అంటూ ట్వీట్ చేశారు.