Idream media
Idream media
టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ లోని చాలా మంది సీనియర్లు చాలా ప్రయత్నించారు. అంత చేసినా కొన్నాళ్ల వరకు ప్రకటనను వాయిదా వేయగలిగారు కానీ, ఆ పదవి దక్కకుండా మాత్రం ఆపలేకపోయారు. కాంగ్రెస్ లో చేరిన మూడున్నర ఏళ్లలోనే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాడు. ఈ సందర్భంగా రేవంత్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేస్తే..
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. చిన్నప్పటికి అందరితో కలిసిపోయే మనస్తత్వం దూకుడు ఆయనకు కలిసి వచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో చేరి తొలుత జడ్పీటీసీ టికెట్ ఆశించాడు. కానీ టీఆర్ఎస్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్గిల్ జడ్పీటీసీగా గెలిచాడు. 2008లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అలా మహబూబ్ నగర్ జిల్లా నేతగా ఎదిగారు.
ఆ తర్వాత టీడీపీలో చేరి 2009 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అసెంబ్లీలో నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించి ప్రజల్లో మీడియాలో ఫేమస్ అయ్యారు. చంద్రబాబు సైతం యువకుడైన రేవంత్ రెడ్డిని ప్రోత్సహించారు. ఓటుకు నోటులో పట్టుబడడం రేవంత్ రెడ్డి కెరీర్ లో మైనస్ గా మారింది. ఆ కేసు ఇప్పటికీ ఆయనను వెంటాడుతూనే ఉంది. అయితే తదనంతర కాలంలో టీడీపీ తెలంగాణలో కుదేలు కావడంతో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచే సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేసి హల్ చల్ చేశారు. దీంతో కేసీఆర్ కూడా రేవంత్ ను సీరియస్ గా తీసుకున్నారు. అందుకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను గెలవకుండా చేయడానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేసి హరీష్ రావును రంగంలోకి దించి మరీ రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో తేరుకున్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీచేసి ఈసారి ప్రజలను మెప్పించి గెలిచాడు. అదే ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక తన రాజకీయ భవష్యత్ ఖతమేనా? అనుకుంటున్న టైంలో మల్కాజిగిరి ప్రజల ప్రోత్సాహంతో ఎంపీగా గెలిచి ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ఎదిగే వరకు ఆయన ప్రయాణం సాగింది. ఎంపీగా గెలవకుంటే ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దక్కి ఉండేదే కాదన్న అభిప్రాయం ఉంది.
కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించినా.. అడ్డంకులు సృష్టించినా.. బలమైన లాబీ ఎదురు వచ్చినా గ్రూపులు వర్గాలు ఫిర్యాదులు ప్రశంసలు అన్నింటిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పీసీసీ చీప్ గా నేడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన లక్ష్యం తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించడం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం.. ఆ తర్వాత అధిష్టానం ఒప్పుకుంటే సీఎం పీఠం. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి సాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.