iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ వైకుంఠపాళిలో పీవీ ఎక్కిన నిచ్చెన మెట్లు

  • Published Jun 28, 2020 | 4:26 PM Updated Updated Jun 28, 2020 | 4:26 PM
కాంగ్రెస్ వైకుంఠపాళిలో పీవీ ఎక్కిన నిచ్చెన మెట్లు

పాములపర్తి వెంకట నరసింహా రావు…
ప్రధాని కాకుండా ఉంటే ఈ పేరు ఎంతమందికి గుర్తుండేది?ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పేర్లు అన్నీ ఎంతమందికి గుర్తున్నాయి… ?

“యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” అని ఏ ప్రధానినైన అనటం ఆ పదవికి అవమానం..ఒకరు వద్దన్న తరువాత మరొకరు పదవిలోకి రావటం యాక్సిడెంటల్ కాదు.. అది అనివార్యత … పీవీ విషయంలో కూడా అంతే .

పీవీ ప్రధాని ఎలా అయ్యారు?
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం బీజేపీ మద్దతుతో జనతాదళ్ నేత విపి సింగ్ ప్రధాని కావటం, జనతాదళ్ విభేదాలతో విపి సింగ్ రాజీనామా చేయగా కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని కావటం ఆయన ప్రభుత్వం కూడా 120 రోజుల్లో కూలిపోవటంతో 1991 ఏప్రిల్ నెలలో ఎన్నికలు వచ్చాయి.

1991 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ముగించుకొని తమిళనాడు వెళ్లిన రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూర్ సభలో తమిళ టైగర్ల ఆత్మాహుతి దాడిలో 21-May-1991న చనిపోయారు. దానితో తదుపరి దశల ఎన్నికలను జూన్ 12,15 తారీఖులకు వాయిదా వేశారు.

రాజీవ్ మరణం – కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు

రాజీవ్ మరణంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టమని అడగ్గా తాను రాజకీయాలలోకి రానని ,అధ్యక్షా పదవి చేపట్టనని ఖరాకండిగా చెప్పటంతో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి సోనియానే చెప్పమని ఆ నాయకులు కోరారు.

కాంగ్రెసులో N.D.తివారి, అర్జున్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్, ఆంటోని,ఇలా అనేకమంది హేమాహేమీలతో పాటు రాజీవ్ గాంధీకి సన్నిహితుడైన మాధవరావు సింధియా తదితరులు కాంగ్రెస్ అధ్యక్షపదవికి పరిశీలించబడ్డారు.

ఈ లిస్టులో పీవీ పేరు లేకపోవటం కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ దానికొక కారణం ఉంది.

రాజీవ్ యువ మంత్రం
1991 ఎన్నికల్లో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో సీనియర్ నాయకులను పోటీకి దూరంగా ఉండమని కోరారు. పీవీ తో సహా అనేక మంది నాయకులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ మేనిఫెస్టో తయారీ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల తరువాత తన నివాసాన్ని హైదరాబాదుకు మార్చాలన్న ఉద్దేశ్యంతో తన ఢిల్లీ ఇంటిని ఖాళీ చేసి సామాన్లను హైద్రబాదులోని తన కొడుకు రాజేశ్వర రావ్ ఇంటికి తరలించారు. పీవీ సామాన్లలో 90% 1500 అట్టపెట్టల్లో ఉన్న ఆయన పుస్తకాలే!

ఒక విధంగా అనధికారికంగా రాజకీయ రిటైర్మెంట్ ను పీవీ ప్రకటించారు. కానీ రాజీవ్ తనను రాజ్యసభకు పంపుతారన్న ఆలోచనో లేక రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక వల్లనో కానీ పీవీ బొంబాయిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

పీవీ మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి 1984 & 1989లో లోక్ సభకు గెలిచి ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న N.K.P సాల్వే ను రాంటెక్ నుంచి పోటీ చేయించి తనకు రాజ్యసభ సీట్ ఇవ్వవలసిందిగా పీవీ రాజీవ్ ను కోరారు. సాల్వే 1961 మరియు 1967 లోక్ సభ ఎన్నికల్లో రాంటెక్ పక్క నియోజకవర్గం బేతుల్ నుంచి గెలిచారు. 1978 నుంచి 2002 వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

సాల్వే స్థానంలో కాకపోయినా రాజీవ్ తనకు రాజ్యసభ అవకాశం ఇస్తారన్న నమ్మకంతో పీవీ బొంబాయిలో ఇల్లు తీసుకున్నారు. రాజ్యసభ కు పోటీచేసేవారు సంబంధిత రాష్ట్రంలో నివాస అడ్రెస్స్ అవసరం దీనితో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సీటు వస్తుందన్న నమ్మకంతో బాంబేలో ఒక అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకొని ఢిల్లీ నుంచి హైద్రాబాద్ కు తరలించిన తన వ్యక్తిగత లైబ్రరీలోని కొన్ని వందల పుస్తకాలను బాంబే ఇంటికి పంపించారు.

N.K.P సాల్వే బీసీసీఐ అధ్యక్ష్యుడిగా ప్రపంచ కప్ తొలిసారి ఇంగ్లాండ్ బయట అదీ భారత్ లో నిర్వహించటంలో కీలకపాత్ర పోషించారు.

నిమ్మగడ్డ కేసు వాదిస్తున్న ప్రముఖ లాయర్,మాజీ సోలిసెటర్ జనరల్ హరీష్ సాల్వే ఈ NKP సాల్వే కొడుకు. ఆ విధంగా పీవీ పేరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మొదట వినిపించలేదు.

రేసులోకి పీవీ పేరు ఎలా వచ్చింది…?
అప్పుడున్న నేతల్లో అందరికన్నా సీనియర్ మరియు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ND తివారీకి కాంగ్రెస్ అధ్యక్షపదవి దక్కాలి. తివారీకి మిగిలిన నాయకుల మద్దతు కూడా ఉండేది. కానీ సీనియర్లు ఎన్నికలకు దూరంగా ఉండండి అన్న రాజీవ్ మాటను కాదని తివారి ఆ ఎన్నికల్లో నైనిటాల్ నుంచి పోటీచేశారు. రాజీవ్ సూచనను పాటించలేదన్న కారణంతో తివారీని అధ్యక్షపదవికి పరిగణించలేదు.

తివారి దురదృష్టం ఏమిటంటే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తివారి ఎన్నికల ప్రచారానికి దిలీప్ కుమార్ ను నైనిటాల్ తీసుకెళ్లారు. అప్పటికే అయోధ్య అంశం రాజకీయ నినాదంగా మారి ఉంది, అద్వానీ రథయాత్ర ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో దిలీప్ కుమార్ పేరు మీద గొడవ జరిగింది. ముస్లిం అయిన నువ్వు ఎందుకు దిలీప్ కుమార్ అని హిందూ పేరు పెట్టుకున్నావని బీజేపీ శ్రేణులు ప్రశ్నించాయి.. కొన్ని చోట్ల పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు.. మొత్తానికి తివారి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు.. తివారీ గెలిచి ఉంటే ప్రధాని కాకపోయినా మంత్రి పదవి దక్కేది.

ఇంక ఎవరిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి?

సోనియాకు సన్నిహితంగా ఉండే నట్వర్ సింగ్ తదితరులు ఇందిరా గాంధీ వద్ద ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసిన P.N. Haksar సలహా తీసుకోమని ఆవిడకు సలహా ఇచ్చారు. హక్సర్ అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోమని సలహా ఇచ్చారు.

సోనియా దూతలుగా శంకర్ దయాళ్ శర్మ వద్దకు వద్దకు నట్వర్ సింగ్, అరుణ ఆసఫ్ అలీ వెళ్ళారు. అప్పటికి 77 సంవత్సరాల వయస్సు, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న శంకర్ దయాళ్ అంత పెద్ద బాధ్యతను తీసుకోలేనని దేశం అంతా తిరిగి ఎన్నికల ప్రచారం చెయ్యలేనని సున్నితంగా సోనియా ఆహ్వానాన్ని తిరస్కరించారు. అదే సందర్భంలో రాష్ట్రపతి పదవి కోసం ఎదురు చూస్తున్నట్లు మనసులో మాట బయట పెట్టారు.

శంకర్ దయాళ్ శర్మ కాదనటంతో సోనియా మరోసారి హక్సర్ సలహా అడిగారు ,ఈసారి ఆయన పి.వీ,నరసింహారావ్ పేరు సూచించారు. ఆ విధంగా పీవీ పేరు తెర మీదికి వచ్చింది. కొత్త అధ్యక్ష పదవికి అనేక మంది పోటిపడ్డారు.అర్జున్ సింగ్,మాధవరావు సింధియా ,శరద్ పవర్ .ప్రణబ్ ముఖర్జీ తదితరులు చేసిన ప్రయత్నాలకు పార్టీలోని ఇతర వర్గాల నుంచి మద్దతు దక్కలేదు. కాని వీరిలో ఎవరైనా పార్టీని చీలుస్తారేమో అన్న సంశయంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక మీద సోనియా చాలా జాగార్తగా వ్యవహరించారు.శరద్ పవార్ ,ప్రణబ్ ముఖర్జీ గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టినవారే!

కాంగ్రెస్ అధ్యక్షుడిగా పీవీ
కాంగ్రెస్ అధ్యక్షపదవికి పీవీ పేరును హక్సర్ సూచించినట్లు నట్వర్ సింగ్ ,సోనియా గాంధీకి తప్ప ఇతరులకు తెలియదు. మరో వైపు పీవీ కూడా తన ప్రయత్నాలు తానూ చేశారు. ఇందిరా,రాజీవ్ ప్రభ్యత్వాలతో ప్రిన్సిపల్ సెక్రెటరీగా చేసిన పి.సి.అలెగ్జాండర్ ను తన తరుపున పీవీ రంగంలోకి దింపారు.

పి.సి.అలెగ్జాండర్ కు కాంగ్రెస్ కోటరీ రాజకీయాలు అన్నీ తెలుసు. ఇందిరా ,రాజీవ్ లతోపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలకు సన్నిహితుడు.

పి.సి.అలెగ్జాండర్ ను “రాజకీయ నాయకుల్లో బ్యూరోక్రాట్ …బ్యూరోక్రాట్లలో రాజకీయనాయకుడు” అంటారు.. పి.సి.అలెగ్జాండర్ సలహా మేరకు రాజీవ్ స్నేహితుడు కాంగ్రెస్ నేత అయిన కెప్టెన్ సతీష్ శర్మ ను పీవీ కలిశారు. పీవీ సతీష్ శర్మను కలవటానికి కొన్ని గంటల ముందే సతీష్ శర్మ సోనియా గాంధిని కలిశారు. ఆ సమావేశంలో సోనియా అధ్యక్షుడిగా ఎవరు అయితే మంచిది అని సతీష్ శర్మను అడగటం ఆయన పీవీ పేరు చెప్పాటం జరిగింది. హక్సర్ కూడా పీవి పేరే చెప్పి ఉండటంతో అధ్యక్ష పదవి విషయం పీవీ తో మాట్లాడమని సతీష్ శర్మను సోనియా కోరారు..

ఆ సాయంత్రం తనను కలిసిన పీవీకి సతీష్ శర్మ సోనియా అభిప్రాయాన్ని చెప్పటం ఆయన అంగీకరించటం జరిగిపోయాయి.. ఆ సమావేశంలో పీవీ తో పాటు పి.సి.అలెగ్జాండర్ మరియు చంద్ర స్వామి కూడా సతీష్ శర్మను కలిసిన వారిలో ఉన్నారు..పీవీ తో సాన్నిహిత్యమే 1997లో పి.సి.అలెగ్జాండర్ రాష్ట్రపతి కావటానికి అడ్డంకిగా అయ్యిందన్న సంగతి అందరికి తెలిసిందే. 29-May-1991న పీవీ ఏఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు.

ఎన్నికల ఫలితాలు
జూన్ 12 మరియు 15 తారీఖులలో రెండవదఫా పోలింగ్ ముగిసింది. జూన్ 18న కౌంటింగ్ జరిగింది. 521 స్థానాలకు(పంజాబ్ & కాశ్మీర్ లలో ఎన్నికల జరగలేదు) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 232,దాని మిత్రపక్షాలు 18(ఇందులో అన్నాడీఎంకే 11),బీజేపీ 120,జనతాదళ్ 59 ,సిపిఎం 35, సిపిఐ 14,టీడీపీ 13 స్థానాలు సాధించాయి.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 262 స్థానాలు కావాలి కానీ మిత్రపక్షాలతో కలిసి 250 స్థానాలే గెలిచింది.

ప్రధానిగా పీవీ
అధ్యక్ష పదవి ఎన్నిక నాటి నుంచే ప్రధాని,పార్టీ అధ్యక్ష పదవులు వేరువేరు నాయకులకు ఇవ్వాలని శరద్ పవార్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రధాని రేసులో తానూ ఉన్నట్లు ప్రకటించారు. ప్రధాని రేసులో పీవీతో పాటు అర్జున్ సింగ్ మరియు శరద్ పవార్ నిలిచారు. తివారి వర్గం మద్దతు అర్జున్ సింగ్ కు ఉండేది.

సోనియా సూచన మేరకు అర్జున్ సింగ్ రేసు నుంచి తప్పుకున్నారు. శరద్ పవార్ ను వప్పించే బాధ్యతను ఆర్ డి ప్రధాన్ కు అప్పగించారు.

ఆర్ డి ప్రధాన్ ఐఏఎస్ క్యాడర్ అధికారి.మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీగా పనిచేశారు. రాజీవ్ ఆహ్వానంతో కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. యూనియన్ హోమ్ సెక్రెటరీగా పనిచేశారు.ఈ అనుభవంతో రాజకీయ నాయకులతో ప్రధాన్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి.

ఆర్ డి ప్రధాన్ సంప్రదింపులతో శరద్ పవర్ ప్రధాని పదవి రేస్ నుంచి తప్పుకొని పీవీకి మద్దతు ఇవ్వటానికి అంగీకరించారు. అయితే తనకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని పవార్ అడగగా పీవీ దాన్ని తిరస్కరించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చారు..

21-Jun-1991 న పీవీ నరసింహా రావ్ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పీవీ మంత్రి మండలిలో శరద్ పవార్ రక్షాణ శాఖ మంత్రిగా ,అర్జున్ సింగ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పదవులు చేపట్టారు..

పీవీని చాణుక్యుడు అని ఎందుకు అంటారో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపిన తీరు.. ఎదుర్కొన్న ఆటుపోట్లు చూస్తే అర్ధమవుతుంది.. మన్మోహన్ ఆర్ధిక మంత్రి కావటం, అవిశ్వాస తీర్మానం గెలవటం, టీడీపీ చీలిక, జేఎంఎం ముడుపుల కేసు, బాబ్రీ కూల్చివేత ,అవినీతి ఆరోపణలు .. అంశాల వారీగా రాయవలసిన విషయాలు..

— పీవీ శతజయంతోత్సవాల సందర్భంగా