iDreamPost
android-app
ios-app

గత ఏడాది కన్నా ఎక్కువగా..

  • Published Dec 19, 2020 | 3:12 AM Updated Updated Dec 19, 2020 | 3:12 AM
గత ఏడాది కన్నా ఎక్కువగా..

రోడ్డు ప్రమాదం.. దీనికి అనేక కారణాలను చూపుతుంటారు. వాహనదారుడి అజాగ్రత్త, మద్యం సేవించి డ్రైవ్‌ చేయడం, అతివేగం, నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం, వాహనం కండిషన్‌ సక్రమంగా లేకపోవడం, ఇంజనీరింగ్‌ లోపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు రోడ్డు ప్రమాదానికి ఆస్కారమిస్తున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వాలు కోట్లలోనే ఖర్చు చేస్తుంటాయి. కానీ ఫలితం మాత్రం అంతంతమాత్రంగా ఉంటుందని చెప్పక తప్పదు. కోవిడ్‌ రోడ్డు ప్రమాదాలను మాత్రం గణనీయంగా తగ్గించదనే చెబుతారు. కోవిడ్‌ప్రభావంతో మనదేశంలో లాక్డౌన్‌ విధించారు. దీంతో ఎక్కడికక్కడే రోడ్డు ప్రమాదాలాకు అవకాశం లేకుండా పోయింది.

అయితే లాక్డౌన్‌ ఎత్తేసిన తరువాత గత యేడాదికంటే కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుండడం పట్ల నిపుణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్‌ సేఫ్టీ విభాగం నివేదికలోనే ఈ విషయం వెల్లడైంది. దీంతో గతేడాది కంటే దాదాపు 20శాతం వరకు ప్రమాదాలు పెరగడం పట్ల సర్వత్రా ఆవేదన చెందుతున్నారు. సెప్టెంబర్‌–నవంబరు మధ్య 5,188 ప్రమాదాలు జరిగితే, 2,073 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇదే నెలల్లో గత యేడాది మాత్రం 4,761 ప్రమాదాలు జరిగి 1,734 మంది మృత్యువాత పడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది దాదాపు 19.4 శాతం మేర ప్రమాదాల సంఖ్య పెరినట్లుగా నిర్దారించారు. ఇతి ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2020 మార్చి నుంచి జూన్‌ వరకు లాక్డౌన్‌ కారణంగా దాదాపు 75శాతానికిపైగా ప్రమాదాలు తగ్గిపోయాయని చెబుతున్నారు. లాక్డౌన్‌ నిబంధనల సడలించాక మాత్రం ఇవి ఆమాంతం పెరిగాయని వివరిస్తున్నారు. ఈ యేడాది ఇప్పటి వరకు 15,993 ప్రమాదాలు జరగ్గా 6,339 మంది మృతి చెందారు. 17వేల మందికిపైగా గాయాలపాలయ్యారని నివేదిక స్పష్టం చేస్తోంది.

వ్యక్తిగత వాహనాలతోనే..

కోవిడ్‌ కారణంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుకంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నవారైన మోటారు బైక్, కార్లను కొనుక్కుని, ప్రయాణంలో సౌలభ్యం, భద్రతలను గురించి ఆలోచిస్తున్నారు. అయితే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు కంటే ప్రైవేటు వాహనాలను ఎక్కువగా వినియోగిస్తుండడమే ప్రమాదాల సంఖ్య పెరగడానికి కూడా కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తుండడంతో విపరీతమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా వాతావరణంలోకి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల కూడా విపరీతంగా పెరిగిపోతుందంటున్నారు. తద్వారా కర్భన ఉద్గారాల పరిమాణం ఎక్కువై, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు కారణంగా ఈ ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు. కానీ నిపుణుల మాట వినే పరిస్థితులు కన్పించడం లేదు. వ్యక్తిగత వాహనాలపై ప్రయాణాలకే ఎక్కువ ప్రధాన్యతనిస్తున్న నేపథ్యంలో ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు సంబంధిత నిపుణులు దృష్టిపెడుతున్నారు.