iDreamPost
iDreamPost
గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కి అసంతృప్తి సెగలు తప్పడం లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి అంశాలను పట్టించుకోకపోవడం, కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండకపోవడం కారణంగా ఆయన తీరు మీద టీడీపీ శ్రేణుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతున్న తీరు స్థానికులను నిరాశపరుస్తోంది. రెండుసార్లు గెలిపించడమే కాకుండా 2019లో టీడీపీకి ఎదురుగాలి వీచినప్పటికీ అనగాని సత్యప్రసాద్ కి అండగా నిలిచిన నియోజకవర్గం వాసులకు మొఖం కూడా చూపించకపోవడం సొంతపార్టీలోనే సత్యప్రసాద్ పట్ల ఆగ్రహానికి కారణమవుతోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నేతలు సత్యప్రసాద్ తీరు మీద పార్టీ అధినేతకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అధినేత కూడా ఏమీ చేయలేని స్ఙితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనగాని సత్యప్రసాద్ కి వైఎస్సార్సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మంత్రి బాలినేని వెంట ఆయన రష్యా వరకూ వెళ్లడమే కాకుండా, ఆ తర్వాత పలు సందర్భాల్లో కనిపించారు. దాంతో అధికార పార్టీతో ఆయన టచ్ లో ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. వాస్తవానికి అంతకుముందే మాజీ మంత్రి గంటాతో కలిసి సత్యప్రసాద్ నేరుగా ఢిల్లీ వెళ్లి అప్పటి బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ తో భేటీ కూడా అయ్యారు. రెండేళ్ల క్రితమే ఆయన పార్టీ ఫిరాయిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన బీజేపీతో భవిష్యత్ ఉండదని నిర్ణయించుకుని ఫిరాయించకుండా వెనకడుగు వేశారు. కానీ టీడీపీలో సైతం క్రియాశీలకంగా కనిపించడం లేదు. చివరకు సొంత నియోజకవర్గానికి సైతం అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి , రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె కూడా కొన్ని సేవా కార్యక్రమాల్లో చొరవ చూపించారు. దాంతో వారసురాలిని తెరమీదకు తీసుకొస్తారనే ప్రచారం కొంత సాగింది. కానీ అది ఏమేరకు నిజమవుతుందన్నది స్పష్టత లేదు. అదే సమయంలో అనగాని సత్యప్రసాద్ కి మాత్రం సెగ రాజుకోవడం ఆసక్తిగా మారుతోంది. టీడీపీ అధినేత వైఖరితో అంత సంతృప్తిగా లేని సత్యప్రసాద్, చివరకు నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజకీయంగా కీలక పరిణామంగా ఉంది. రేపల్లె వాసుల్లో పలు రకాల చర్చలకు ఇది ఆస్కారమిస్తోంది.