Idream media
Idream media
1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. ఆర్ట్స్ కళాశాల ఉత్సవాలకి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ప్రెసిడెంట్ రావడమంటే మాటలా? వూరంతా బందోబస్తు. ఏరియల్ సర్వేకి ముందుగా హెలికాప్టర్ వచ్చింది. ఆ శబ్దానికి అనంతపురం జనమంతా వచ్చి ఆకాశాన్ని చూసారు. మాలాంటి పిల్లలు సినిమాల్లో తప్ప, నిజంగా ఎప్పుడూ చూడలేదు. స్టేడియంలో దిగిందని తెలిసి పరిగెత్తాం. అక్కడ జనజాతర హెలికాప్టర్‌ని చూడ్డానికి వచ్చిన వాళ్లతో స్టేడియం నిండిపోయింది. ఆ రోజు వూరంతా హెలికాప్టర్ కబుర్లే.
మరుసటి రోజు సంజీవరెడ్డి వచ్చారు. ఆర్ట్స్ కాలేజి బహిరంగ సభకి నేనూ వెళ్లాను. అపుడు నేను ఇంటర్. సంజీవరెడ్డి చాలా చమత్కారంగా అనంతపురాన్నికాసేపు పొగిడారు. తరువాత టోపి తీసి బట్టతలని తుడుచుకుంటూ “నా అదృష్టం ఏమంటే ఇంకెపుడూ జీవితంలో అనంతపురం ప్రజలని ఓటు అడిగే అవసరం రాదు” అన్నారు. ఆయన్ని అనంతపురం ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించలేదు. అదీ విషయం.
తరువాత రోజుల్లో అనంతపురానికి హెలికాప్టర్ అలవాటైపోయింది. ప్రధానిగా మురార్జీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కేంద్రమంత్రిగా జగజ్జీవన్‌రామ్ హెలికాప్టర్‌లో వచ్చారు. ఇందిరాగాంధీ మాత్రం రోడ్డు మార్గంలోనే బెంగళూరు నుంచి వచ్చారు. అన్ని సభలు ఆర్ట్ కళాశాల ఎదురు మైదానంలోనే. ఇపుడు గ్రౌండే లేకుండా చేసి గోడ కట్టేశారు. అయినా సభలు పెట్టే నాయకులూ లేరు, జనమూ రావడం లేదు.
1985లో ముఖ్యమంత్రిగా NTR హెలికాప్టర్‌లోనే వచ్చారు. అపుడు హెలికాప్టర్‌ని కాకుండా NTR ని చూడ్డానికి జనమొచ్చారు.
అనంతపురం విపరీతమైన రాజకీయ చైతన్యం వున్న వూరు. ప్రముఖుల సభలు జరిగేవి. 1977లో డాక్టర్ కోవూరు ప్రసంగం వినడం నా అదృష్టం. ఒక హేతువాది సభకు లలిత కళాపరిషత్ నిండిపోవడం ఆశ్చర్యం.
రాజకీయాలెప్పుడూ తమాషాగా వుంటాయి. 1978 ఎన్నికలకి రెడ్డి కాంగ్రెస్ తరపున రోశయ్య వచ్చారు. ఇందిరాగాంధీని భయంకరంగా విమర్శించారు. ఈ తరువాత కాలంలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి కావడం విచిత్రం.