iDreamPost
android-app
ios-app

Akkineni Nageswara Rao : చెరిగిపోని నట సంతకం ANR

  • Published Jan 22, 2022 | 4:47 AM Updated Updated Jan 22, 2022 | 4:47 AM
Akkineni Nageswara Rao : చెరిగిపోని నట సంతకం ANR

తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పి అత్యున్నత శిఖరాలకు చేర్చిన వాళ్ళలో ముందువరసలో చెప్పుకోదగిన పేరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. అభిమానులు, దర్శక నిర్మాతలు ప్రేమతో ఏఎన్ఆర్ అని పిలుచుకునే అభినయ ఆణిముత్యం ప్రస్థానంలో ఎప్పటికీ చెరిగిపోని మైలురాళ్ళూ ఎన్నో ఎన్నెనో. స్వాతంత్రం రాకపూర్వం 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా రామాపురం గ్రామంలో వెంకటరత్నం, పున్నమ్మ పుణ్యదంపతులకు ఈయన జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే తరహాలో చాలా చిన్న వయసులోనే 1941లో సి పుల్లయ్య తీసిన ధర్మపత్నిలో తొలిసారి చిన్నపాత్రలో కనిపించారు. ఆ తర్వాత రెండేళ్లకే సీతారామజననంలో హీరోగా పరిచయమవడం అతి త్వరగా ఆయనకు తొలిబ్రేక్ దక్కేలా చేసింది.

ఘంటసాల బలరామయ్య దర్శకుడిగా ఏఎన్ఆర్ బంగారు భవిష్యత్తుకు తొలిబాటలు వేశారు. అక్కడి నుంచి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్నారు అక్కినేని. కీలుగుర్రంతో జానపద చిత్రంలో తన సత్తా చాటిన ఈయనకు అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల, మాయలమారి ఇలా వరసగా విజయలక్ష్మి వెన్నాడుతూ వచ్చింది. నందమూరి తారకరామారావు అనే సమ్మోహన శక్తి తీవ్రపోటీ ఇస్తున్నప్పటికీ తనదైన శైలిలో ప్రస్థానాన్ని కొనసాగించారు నాగేశ్వర్రావు. తన సమకాలికుడైన ఎన్టీఆర్ తో ఏకంగా 14 మల్టీ స్టారర్స్ లో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ఘట్టం ప్రేమలో విఫలమైన భగ్నప్రేమికుడిగా ఏఎన్ఆర్ దేవదాసులో చూపించిన నటన అజరామరం. ఇప్పటికీ దాన్ని తలదన్నే స్థాయిలో ఏ నటుడూ మెప్పించలేకపోయారు.

విప్రనారాయణ, దొంగరాముడు, బుద్దిమంతుడు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, జయభేరి, నమ్మిన బంటు, వెలుగు నీడలు, డాక్టర్ చక్రవర్తి, గుండమ్మ కథ, కులగోత్రాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అద్భుత చిత్రాలు ఎన్నో చేశారు అక్కినేని,. కలర్ సినిమాల ప్రభంజనం మొదలై కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబుల తరం మొదలయ్యాక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా వాళ్లకు ధీటుగా నడిపించారు. షష్టిపూర్తి వయసులో లవ్ బాయ్ గా నటించిన ప్రేమాభిషేకం ఏకంగా ఏడాది పైగా ఆడి పాత రికార్డులు దుమ్ము దులపడం చిన్న ఉదాహరణ. థర్డ్ ఇన్నింగ్స్ లో వయసు మళ్ళిన పాత్రల్లో సీతారామయ్య గారి మనవరాలతో ప్రేక్షకుల హృదయాలను తడిచేసి మనసులు గెలుచుకోవడం ఆయనకే చెల్లింది.

చిరంజీవితో మెకానిక్ అల్లుడు, బాలకృష్ణతో గాండీవం, వెంకటేష్ తో బ్రహ్మరుద్రులుతో పాటు కొడుకు నాగార్జునతో కలెక్టర్ గారి అబ్బాయి-ఇద్దరూ ఇద్దరే, సుమన్ తో రావుగారింట్లో రౌడీ లాంటి ఎన్నో సినిమాలతో సెకండ్ జెనరేషన్ తో కూడా కనెక్ట్ అయ్యారు. ఊపిరి ఉన్నంత వరకు సినీ రంగానికే తన జీవితాన్ని అంకితం చేసిన అక్కినేని తన కుటుంబ మూడు తరాల హీరోలతో చేసిన ‘మనం’ ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఇచ్చిన గొప్ప నివాళి. అందుకే మన మధ్య లేకపోయినా ఎన్నో మరపురాని సినిమాలతో అక్కినేని నాగేశ్వరరావు గారు అందరి గుండెల్లో అమరజీవిగా సజీవంగానే ఉంటారు.

Also Read : RRR Release : రాజమౌళి ప్లాన్ చేసింది అందుకేనా