Idream media
Idream media
అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మేట్ టీ-20 ప్రవేశంతో ఇక అందులో బ్యాట్స్‌మన్‌లదే హవా అని అందరూ విశ్లేషించారు. అందుకు తగ్గట్లుగానే టీ-20ల ప్రారంభంలో బ్యాట్స్‌మెన్ బౌలర్లపై ఆధిక్యత ప్రదర్శించారు. పైగా తొలి ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం సాధ్యమేనని నిరూపించి ఆ విశ్లేషణలను నిజం చేశాడు. కానీ భారత్‌లో ప్రారంభమైన ఐపీఎల్-2008 తొలి సీజన్‌లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ టీ-20లలో ప్రశ్నార్థకంగా మారిన బౌలర్ల ఉనికిని తన హ్యాట్రిక్‌తో సమాధానమిచ్చాడు. సరిగ్గా ఈ రోజునే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలో దిగిన బాలాజీ ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2008 యొక్క 31 వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది.టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌లు స్టీఫెన్ ఫ్లెమింగ్, శివ రామకృష్ణన్ తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. సురేష్ రైనా 26 పరుగులు,ఎస్ బద్రీనాథ్ 64 పరుగులు చెయ్యగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43 బంతులలో అజేయంగా 60 పరుగులు సాధించాడు.దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లకు 181 పరుగులు చేసింది.
లక్ష్యఛేదనలో తొలి పన్నెండు ఓవర్లు ముగిసే సమయానికి 95/2 పరుగులు చేసి KXIP విజయం వైపు ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.ఈ దశలో 13 ఓవర్ మొదటి బంతికి రామ్ నరేష్ శర్వాన్(20)తో పాటు ఐదో బంతికి 38 బంతులలో 58 పరుగులు చేసిన షాన్ మార్ష్‌ను బాలాజీ వెనక్కి పంపాడు.మూడో వికెట్‌కు శర్వాన్,మార్ష్‌లు 66 పరుగులు జోడించాడు. యువరాజ్ సింగ్ రెండు పరుగులకే ఔట్ అయినప్పటికీ ఇర్ఫాన్ పఠాన్ 15 బంతులలో 3 ఫోర్లు,2 సిక్స్‌ల సహాయముతో 32 పరుగులుచేసి జోరుమీదున్నాడు.ఇక KXIP విజయానికి ఆరు బంతులలో 26 పరుగులు పరుగులు సాధించాల్సి ఉంది.అప్పటికే రెండు వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ బాలాజీ చివరి ఓవర్ బౌలింగ్ చెయ్యటానికి బంతి చేత పట్టాడు.
ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌లో బాలాజీ హ్యాట్రిక్ మాయాజాలం:
కేవలం తన కెరీర్‌లో రెండవ టీ20 మాత్రమే ఆడుతున్న బాలాజీ సంధించిన మొదటి బంతిని పఠాన్ మిడ్ వికెట్ దిశలో సిక్స్ బాదాడు.రెండో బంతికి రెండు పరుగులు చేసి మూడో బంతిని భారీ షాట్ ఆడటానికి సిద్ధపడ్డాడు. అయితే డీప్ స్క్వేర్ లెగ్ వద్ద సురేష్ రైనా పట్టిన క్యాచ్‌తో పఠాన్ వికెట్‌ను తన ఖాతాలో బాలాజీ వేసుకున్నాడు. నాలుగో బంతికి లాంగ్ ఆఫ్ వద్ద చమారా కపుగేదరా పట్టిన క్యాచ్‌తో పియూష్ చావ్లా పెవిలియన్ వైపు నడిచాడు.అతను షార్ట్ పిచ్‌గా వేసిన ఐదో బంతికి విఆర్‌వి సింగ్ ఫుల్ షట్‌కు ప్రయత్నించి కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
బాలాజీ KXIP ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మూడు వరుస బంతులలో వికెట్లు సాధించి ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా తన పేరు లిఖించాడు.KXIPపై 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలవడంలో కీలక భూమిక పోషించిన బౌలర్ బాలాజీ తన కోటా 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.అతను ఐపీఎల్ 2008 తొలి సీజన్‌లో 9 మ్యాచ్లు ఆడి 26.00 సగటుతో 11 వికెట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు.