Idream media
Idream media
దేశంలో కరోలా విలయతాండవాన్ని ఎదుర్కోవడానికి సహాయాన్ని అర్థించిన ప్రధాని మోదీకి పిలుపునకు దేశంలోని సామాన్యుడి నుంచి ప్రముఖులందరూ స్పందిస్తున్నారు. తమ స్థాయికి తగినట్లు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా దేశంలోనే అపర కుబేరుడిగా పేరు గాంచిన ముఖేష్ అంబానీ భారీ విరాళంతో ముందుకు వచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున పీఎమ్ కేర్స్ నిధికి 500 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే గుజరాత్ సహాయనిధికి రూ. 5 కోట్లు, మహారాష్ట్ర సహాయ నిధికి రూ. 5 కోట్లు అందించింది. కరోనా కట్టడికి ప్రధాని తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తమ మద్ధతు ఉంటుందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
డబ్బు విరాళంతోపాటు తాము చేయనున్న సహాయ కార్యక్రమాల ప్రణాళికను రిలయన్స్ వెల్లడించింది. భారత దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ ఆస్పత్రిని కేవలం రెండు వారాల్లోనే 100 పడకలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో ప్రతి పడకకు వెంటిలేటర్ల సదుపాయం, పేస్‌మేకర్లు, డయాలసిస్ మెషీన్లను అమర్చుతామని వెల్లడించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశమంతటా రాబోయే పది రోజుల్లో అరకోటి మందికి ఉచిత భోజనాన్ని అందిస్తామని పేర్కొంది. కరోనా నివారణలో నిమగ్నమైన హెల్త్ వాలంటీర్లు, మెడికల్ సిబ్బందికి రక్షణగా రోజూ లక్ష మాస్కులను తయారు చేయనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వాహనాలకు తమ బంకుల్లో ఉచిత ఇంధన సదుపాయాన్ని అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నందున వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జియో టెలికాం ద్వారా నాణ్యమైన సేవలను అందిస్తామని పేర్కొంది. రిలయన్స్ రిటైల్ దుకాణాల ద్వారా రోజూ వారీ నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తామని చెప్పింది.