iDreamPost
iDreamPost
ప్రతీ ఏటా వర్షాకాల ప్రారంభంలోనే విషజ్వరాలు విజృంభించడం దశాబ్దకాలం క్రితం సహజంగా కనిపించేది. వందల మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయేవారు. కానీ కొంతకాలంగా పరిస్థితి మారుతోంది. క్రమంగా వైద్యసేవలు మెరుగుపడడడంతో ఏజన్సీలో ఆరోగ్యవసతులు మెరుగుపరిచే చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే విశాఖ మన్యంలో పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం పూనుకుంది. రెండేళ్ల క్రితం వరకూ పురుడు పోయడానికి గైనకాలజిస్ట్ కూడా లేని పాడేరులో ప్రస్తుతం మెరుగైన వైద్యం అందించేందుకు ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
ఇక విలేజ్ క్లినిక్కుల మూలంగా మారుమూల పల్లెల్లో కూడా సచివాలయానికి అనుసంధానం చేసిన వైద్య సేవల విస్తరణ ఏజన్సీ ప్రజలకు ఎంతో ఊరట కల్పించబోతోంది. ఏజన్సీలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల చొరవ కొంత ఫలితాన్నిస్తోంది. ఏ ఎన్ ఎం లు కూడా వెళ్లలేని ప్రాంతాల్లో సీహెచ్ డబ్ల్యూలే మందులు అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇక ఇప్పుడు విలేజ్ క్లినిక్కులు ఏర్పాటయితే వారి సేవలు మరింత విస్తరిస్తాయి. మందులు అందుబాటులో ఉంటాయి. సిబ్బంది సకాలంలో స్పందిస్తే ఏజన్సీలో మరణ మృదంగానికి ముగింపు పలికే వీలవుతుంది.
కొందరు వైద్య సిబ్బంది ఇప్పటికే ఎంతో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారు. సున్నం రాజయ్య వంటి ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కూడా ఎంతో సేవా దృక్పథంతో వ్యవహరించడం మన్యంలో పరిస్థితులు మెరుగుపడడానికి ఓ మూల కారణం. ఇప్పుడు ఆయన కనుమరుగయినా చింతూరు పరిసరాల్లో కొందరు డాక్టర్లు గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా రేఖపల్లి పీహెచ్ సీ డాక్టర్ సుందర ప్రసాద్ తీరు గిరిజనుల అభినందనలు అందుకుంటోంది. ఆయన గోదావరిలో వరదల సమయంలో కూడా పడవలపై వెళ్లి వైద్య సేవలు అందించడం, చివరకు తనకు ఆరోగ్యం సహకరించకపోయినా సెలైన్ పెట్టుకుని మరీ సేవలు అందించడం వైరల్ అయ్యింది.
చింతూరు ప్రాంతంలో ఐటీడీఏ అధికారుల చొరవ, వైద్య సిబ్బంది చిత్తశుద్ధి కలిసి గతంలో ఉన్న గడ్డు స్థితి నుంచి గట్టెక్కడానికి దోహదపడుతోంది. ఇక రంపచోడవరం ఏజన్సీలోని మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో కూడా విలేజ్ క్లినిక్కుల ఏర్పాటు పూర్తయితే మలేరియా సహా అన్నిరకాల మహమ్మారులను ఎదుర్కోవడం సులవవుతుందని భావిస్తున్నారు.