iDreamPost
android-app
ios-app

Kolleru – కొల్లేరుకు రెగ్యులేటర్‌..!

  • Published Dec 11, 2021 | 3:54 PM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Kolleru – కొల్లేరుకు రెగ్యులేటర్‌..!

ఇటు పర్యాటక కేంద్రంగాను.. అటు వలస పక్షులకు విడిదిగాను… సహజ సిద్ధమైన మత్స్య సంపదకు ఆలవాలంగా నిలిచిన కొల్లేరు సరస్సు పరిరక్షణకు చేపట్టాల్సిన రెగ్యులేటర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సముద్రం నుంచి ఉప్పునీరు ఎగదన్ని మంచినీటి సరస్సు కొల్లేరు దెబ్బతినకుండా రెగ్యులేటర్‌ నిర్మించాలని ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. అయినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాని ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కొల్లేరు రెగ్యులేటర్‌ నిర్మాణానికి అంగీకరించడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు దేశంలోని సహజసిద్ధమైన మంచినీటి సరస్సుల్లో ఒకటిగా గుర్తింపు సంతరించుకుంది. ఇది 250 కిమీల నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందని అంచనా. ప్రకృతి అందాలకు, వలస వచ్చే పక్షులకు కొల్లేరు ఆలవాలం. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుంచే కాకుండా డెల్టా కాలువల నుంచి మంచినీరు ఈ సరస్సులోకి వచ్చి చేరుతుంది. సరస్సులో మిగులు జలాలు ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఉప్పుటేరు మీద రెగ్యులేటర్‌ నిర్మాణం తప్పనిసరి. లేకుంటే విపత్తుల సమయంలో ఉప్పుటేరు ద్వారా ఉప్పునీరు సరస్సులో చేరుతుంది. దీని వల్ల సహజ సిద్ధంగా పెరిగే మంచినీటి చేపలు చనిపోతున్నాయి. మంచినీరు సరస్సు నుంచి సముద్రంలోకి వెళ్లడం వల్ల వేసవి సమయంలో కొల్లేరు చాలా వరకు ఎండిపోతుంది. రెగ్యులేటర్‌ నిర్మాణం జరిగితే ఈ రెండు ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టేనని ఇక్కడి రైతులు, మత్స్యకారులు చెబుతున్నారు. ఇందుకోసం దీని నిర్మాణం చేయాలని వారు ఏళ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు జగన్‌ సర్కార్‌లో వీరి కల నెరవేరనుంది.


కొల్లేరు రెగ్యులేటర్‌ను రూ.110 కోట్లతో

కొల్లేరు రెగ్యులేటర్ ను ఆధునీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆఘమేఘాల మీద రూపుదిద్దుకున్నాయి.రెగ్యులేటర్ నిర్మించే ప్రదేశం, డిజైన్‌లో మార్పులు, చేర్పులను అధికారులు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ ఫైల్‌ ఆర్థిక శాఖ వద్ద ఉంది. అనుమతి రాగానే ఇరిగేషన్‌ శాఖ టెండర్లు పిలవనుంది. ఉప్పుటేరు జువ్వ కనుమ వద్ద కొల్లేరు రెగ్యులేటర్‌ నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అప్పట్లో ప్రభుత్వం నియమించిన మిత్రా కమిటీ ఈ సూచన చేసింది. నాడు దీని నిర్మాణానికి రూ.53.07 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కాని ఇది ప్రతిపాదనకే పరిమితమైంది. కొత్తగా నియమించిన కమిటీ దీనిని జువ్వకాలువ వద్ద నిర్మాణం కన్నా ఉప్పుటేరు రైల్వే, రోడ్డు బ్రిడ్జిల మధ్యలో నిర్మిస్తే మంచి ఫలితం ఉంటుందని తేల్చింది. డిజైన్లు కూడా మార్పులు చేశారు. ముంపునీరు దిగేందుకు వీలుగా 15 షటర్లు, జలరవాణాకు వీలుగా మూడు షటర్లు నిర్మించాల్సి ఉంది. అలాగే ఉప్పుటేరు ఎగువున, దిగువునా గట్లను అభివృద్ది చేసి పటిష్టం చేయాల్సి ఉంది. ఇందుకు కొంత భూమిని కూడా సేకరించాలి. వీటితోపాటు కొన్నిచోట్ల డ్రైనేజీ షటర్లు నిర్మించనున్నారు. స్థలం మారడం, డిజైన్లు మార్పు జరగడం, పెరిగిన అంచనాల ఫలితంగా తాజాగా దీనిని నిర్మించాలంటే రూ.110 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.


మాటకు కట్టుబడిన జగన్‌:

ప్రజా సంకల్పయాత్రలో స్థానిక రైతులు ఈ విషయాన్ని వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనికి స్పందించిన ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెగ్యులేటర్‌ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. కొన్ని నెలల క్రితం కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా రెగ్యులేటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీని సీఎంగా జగన్‌ నెరవేర్చడం అభినందనీయమని ఇక్కడ రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొల్లేరు ఆక్రమణలకు కారణమైన ఆక్వా చెరువులను 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ధ్వంసం చేయించిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు తండ్రి హయాంలో కొల్లేరు పరిరక్షణ జరిగితే.. నేడు తనయుడి హాయాంలో కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టయ్యిందని రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత.. సీఎం ముందు జాగ్రత్త ..