Idream media
Idream media
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన రైల్వే సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ నెల నుంచి వలస కార్మికులు, కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు, ఉన్నత శ్రేణి ప్రయాణికులకు ఏసీ రైళ్లును నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా నాన్ ఏసీ రైళ్లను కూడా నడపాలని నిర్ణయించింది. వచ్చె నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా నాన్ ఏసీ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు అనుమతిలేని వారు ఈ రైళ్లలో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఇప్పటి వరకూ నాలుగు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. చివరగా ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇది ముగిసిన తర్వాత రైళ్ల సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే 4వ విడత లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రజా రావాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ బస్సులను తిప్పాలా లేదా.. అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు సిద్ధమయ్యాయి.