iDreamPost
iDreamPost
సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వలంటీర్లు, ఆర్బీకేలు, సమగ్ర భూ సర్వే, నిజమైన సాగుదారులకు హక్కులు వంటి పలు పరిపాలనా సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న లొసుగులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ లొసుగులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయానికి కొందరు భారీగా
గండికొడుతున్నారు. అలా
జరుగుతున్న పలు రకాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల పలు సవరణలు తెచ్చింది. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లలో భాగంగా బిల్డర్లు, భూ యజమానుల మధ్య జరిగే రిజిస్ట్రేషన్లలో అనేక లోపాలు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఈ తరహా రిజిస్ట్రేషన్లకు మొన్నటివరకు స్టాంప్ డ్యూటీ ఒక శాతం ఉండేది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఒప్పందంలో ఉన్నట్లు ఉమ్మడిగా వారి పేర్లపైనే ఉంచుకుంటే దానికి ఒక శాతమే కట్టించుకుంటారు. అలా కాకుండా విడివిడిగా పంచుకుంటే మాత్రం 4 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. విక్రయ, జీపీఏ కింద జరిగే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీని కూడా సవరించారు. వీటిని ఆధారంగా చేసుకుని భూయజమానులు లేకుండానే ఆయన తరఫున మరో వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటున్నారు. దీనికి 5 శాతం స్టాంప్ డ్యూటీ కడుతున్నారు. ప్రస్తుత విధానంలో అటార్నీ తీసుకున్న వ్యక్తి ఆ ఆస్తిని కొనుగోలు చేసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, వేరే వారికి అమ్మినా స్టాంప్ డ్యూటీలో 4 శాతం తగ్గింపు ఉంటుంది. కానీ కొత్త విధానంలో అటార్నీ తీసుకున్న వ్యక్తి వేరే వారికి ఆ ఆస్తిని అమ్మితే 4 శాతం మినహాయింపు ఉండదని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది.
వారసత్వ ఆస్తులపైనా..
వారసత్వంగా వచ్చిన ఆస్తులను కుటుంబ సభ్యులు పంచుకుని చేయించుకునే రిజిస్ట్రేషన్లపై కూడా స్టాంప్ డ్యూటీని సవరించారు. గతంలో సంబంధిత ఆస్తిలో పెద్ద వాటా ఎవరికి వస్తుందో వారికి స్టాంప్ డ్యూటీ మినహాయించేవారు. మిగిలిన వాటాలపై ఒక శాతం స్టాంప్ డ్యూటీ కట్టించుకునేవారు. కానీ నూతన విధానంలో పెద్ద వాటాకు మినహాయింపు ఇచ్చి.. మిగిలిన వాటాలపై ఒక శాతంతోపాటు అదనంగా వచ్చిన వాటాపై మూడు శాతం డ్యూటీ విధిస్తున్నారు. ఈ మార్పులు చేయకముందు ప్రభుత్వానికి లెక్క ప్రకారం రావాల్సిన స్టాంప్ డ్యూటీ వచ్చేది కాదు.
Also Read : కృష్ణాలోనూ మొదలైంది.. ఇక మిగిలింది ఏడు జిల్లాలే..