iDreamPost
android-app
ios-app

Reddy Corporation Chairman, Kanigiri – రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ దూకుడు.. కనిగిరిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

Reddy Corporation Chairman,  Kanigiri – రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ దూకుడు.. కనిగిరిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పట్టుకోసం వేగంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో శాశ్వతంగా పాగా వేసేందుకు దూకుడుగా వెళుతున్నారు.

కార్పొరేషన్‌ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలుస్తూ,నేతలతో భేటీ అవుతున్న సత్యనారాయణ రెడ్డి.. తాజాగా కనిగిరి పట్టణంలో సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు బుధవారం కనిగిరి పట్టణంలోని 7వ వార్డులోని.. దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం కూడలిలో ఇంటి నిర్మాణం కోసం సత్యనారాయణ రెడ్డి దంపతులు భూమి పూజ చేశారు. ఆ తర్వాత.. కనిగిరి పట్టణంలోనే రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ క్యాంపు కార్యాలయాన్ని సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.

హనుమంతునిపాడు (హెచ్‌.ఎం.పాడు) మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి… హైదరాబాద్‌లో 1998లో శ్రీ వెంకటేశ్వర ఏరో స్పేస్‌ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు. వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదిగిన సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. సత్యనారాయణ రెడ్డి తండ్రి రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ వెంకటనారాయణ రెడ్డి సీతారామపురం పంచాయతీ సర్పంచ్‌గా 2001 నుంచి వరుసగా రెండు పర్యాయాలు పని చేశారు. పంచాయతీని జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా  తీర్చిదిద్ది.. నిర్మల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

Also Read : AP Politics ,Jagan ,Chandrababu – ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సందడి, మండలి ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ కూర్పు చుట్టూ చర్చ

వైసీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సత్యనారాయణ రెడ్డి.. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో కనిగిరిలో కీలక పాత్ర పోషించారు. 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నా.. వ్యాపార కార్యకలాపాల వల్ల వెనక్కి తగ్గారు. ఇప్పుడు తన కుమారుడు అందిరావడంతో.. కంపెనీ బాధ్యతలను అతనికి అప్పజెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలని సత్యనారాయణ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కనిగిరిలో సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

2024 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో సత్యనారాయణ రెడ్డి ఉన్నట్లు ఆయన చర్యల ద్వారా అర్థమవుతోంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమీకరణాలు ఆయనకు కలసి వచ్చే అవకాశం ఉంది. సత్యనారాయణ రెడ్డి మామ.. కనిగిరి నియోజకవర్గానికి చెందిన ఉడుముల లక్ష్మీనారాయణ రెడ్డి వైసీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడుగా పని చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డితో సత్యనారాయణ రెడ్డి వియ్యం అందుకున్నారు. సాయిప్రసాద్‌ రెడ్డి కుమారుడికి సత్యనారాయణ రెడ్డి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఇవన్నీ.. సత్యానారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు కలిసి వస్తాయనే అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఉన్నారు. కొండేపి నియోజకవర్గం టంగుటూరుకు చెందిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ హోదాలో సత్యనారాయణ రెడ్డి కదుపుతున్న రాజకీయ పావులు.. రాబోయే రోజుల్లో కనిగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.

Also Read : Muncipal Nominations, Chandrababu, TDP – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?