iDreamPost
android-app
ios-app

టెస్టులలో డకౌట్ రికార్డులు బౌలర్లవే!

టెస్టులలో డకౌట్ రికార్డులు బౌలర్లవే!

క్రికెట్‌ పిచ్‌పై తమ గిరగిరా తిరిగే బంతులతో బ్యాట్స్‌మన్‌లను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లు బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేసి పరుగులు ఖాతా తెరవకుండానే మూటాముల్లె సర్దేసినా ఘటనలు కోకొల్లలు.

అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టులలో 710,వన్డేలలో 455 వికెట్లతో మొత్తం 1165 మంది బ్యాట్స్‌మన్‌లను ఔట్ చేసి అత్యధిక వికెట్లు పడగొట్టినా బౌలర్‌గా రికార్డులకెక్కాడు.కానీ అదే సమయంలో బ్యాట్స్‌మన్‌గా తన పేరుమీద ఒక  చెత్త రికార్డును నమోదు చేశాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 59 సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయి అపకీర్తి పొందాడు.

ఇక 43 టెస్టులలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ అత్యధికంగా సున్నా పరుగులకే ఔటై డక్‌ల రికార్డులో అగ్రస్థానం పొందాడు.న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ మార్టిన్ అత్యధికంగా ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ స్కోరు చేయకుండా ఔట్ అయ్యాడు. ఈ రికార్డుతో పాటు మార్టిన్ 104 ఇన్నింగ్స్‌లలో 36 సార్లు సున్నా పరుగులకే ఔటై,టెస్టుల్లో అత్యధిక డక్‌ల రికార్డులో కోర్ట్నీ వాల్ష్ తర్వాతి స్థానంలో ఉన్నాడు

టెస్టులలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నాలుగు డక్‌లతో ఐదుగురు ఆటగాళ్ళు ఔట్ అయ్యారు.వీరిలో నలుగురు బౌలర్లు కాగా,ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం. ఈ అవాంఛనీయ జాబితాలో భగవత్ చంద్రశేఖర్ (IND),ముత్తయ్య మురళీధరన్ ( SL),మెర్వైన్ డిల్లాన్(WI), కోర్ట్నీ వాల్ష్(WI), అటపట్టు (SL)లు చోటు దక్కించుకున్న దురదృష్టవంతులు.మూడు టెస్టులలో రెండుసార్లు డక్‌ ఔటైన 14 మందిలో గ్లెన్ మెక్‌గ్రాత్(AUS),కర్ట్లీ ఆంబ్రోస్(WI),ఆండ్రూ ఫ్లింటాఫ్(END)లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నారు.

గోల్డెన్ డకౌట్‌ రికార్డ్ బాంబే డక్ దే :
టెస్టులలో వరుసగా ఐదుసార్లు డకౌట్ అయినా రికార్డును బాబ్ హాలండ్,అజిత్ అగార్కర్,మహ్మద్ ఆసిఫ్ ముగ్గురు పంచుకున్నారు. వీరిలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ అగార్కర్ 1999-2000 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై బ్యాటింగ్‌కు దిగిన ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సందర్భాలలో మొదటి బంతికే ఔట్ కావడం విశేషం.ఈ డకౌట్ క్రమం తర్వాత కూడా అగార్కర్ 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ముంబై టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ మరోసారి సున్నా పరుగులకే ఔటైయ్యాడు.దీంతో అగార్కర్ ఆస్ట్రేలియాపై వరసగా ఏడు డకౌట్లతో పరమ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తమ టెస్ట్ కెరీర్‌లో వరుసగా నాలుగు బాతులకు అవుటైన వారిలో వెస్టిండీస్ ఆటగాడు మెర్విన్ డిల్లాన్‌తో పాటు, శ్రీలంక ప్లేయర్ నువాన్ ప్రదీప్ ఉన్నారు.

1998-99లో ఆక్లాండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జియోఫ్ అలోట్ 101 నిమిషాల పాటు 77 బంతులను ఎదుర్కొని చివరికి పరుగులేమీ సాధించకుండా ఔట్ అయ్యాడు.దీంతో సుదీర్ఘ సమయం క్రీజులో గడిపి డకౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డును నెలకొల్పాడు.2006లో కౌలాలంపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వెస్టిండీస్ రునాకో మోర్టన్ అధికంగా 31 బంతులను ఆడి సున్నా పరుగులకు ఔటైనా ఆటగాడిగా నిలిచాడు.

డక్‌లతో కెరీర్‌ను ప్రారంభించి 16 శతకాలు బాదిన అటపట్టు:
శ్రీలంక మాజీ కెప్టెన్ మరియు కోచ్ మర్వాన్ అటపట్టు తన మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదు డకౌట్‌లతో తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు. మిగతా ఒక ఇన్నింగ్స్‌లో కూడా కేవలం ఒక పరుగు మాత్రమే చేయడం విశేషం.తన కెరీర్‌ను ఇంత ఘోరంగా ఆరంభించిన మర్వాన్ 6 ద్వి శతకాలతో సహా 16 శతకాలు సాధించాడు.22 టెస్ట్ డకౌట్‌లతో పాటు ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సున్నా పరుగులకే రెండుసార్లు ఔటైన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌. భారత్‌పై టెస్టులలో ఆరంగేట్రం చేసిన అటపట్టు 90 మ్యాచ్‌లలో 39.02 సగటుతో 5504 పరుగులు చేశాడు.


తొలి టెస్ట్ ఇన్నింగ్స్,తొలి వన్డేలో మొదటి బంతికి గోల్డెన్ డక్‌గా ఔటైన క్రికెటర్లుగా మెక్‌గ్రాత్‌,చాడ్విక్ వాల్టన్ ఇద్దరు రికార్డు సాధించారు. కాగా డిసెంబర్ 2018లో జరిగిన సెంచూరియన్ టెస్ట్‌లో ఇరు జట్ల కెప్టెన్లు డుప్లెసిస్ (SA),సర్ఫరాజ్ (PAK) ఇద్దరూ రెండు ఇన్నింగ్స్‌లలో డకౌటైన మ్యాచ్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచింది.