Idream media
Idream media
సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులందరూ విచ్చేసి శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు జనవరి 25 న రాత్రి కృష్ణంరాజు ఇంటికి వచ్చి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రెబల్ స్టార్ తో మరోసారి కేక్ కట్ చేయించారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులందరూ ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. కృష్ణంరాజు కు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ అదే వార్త ప్రచారం జరుగుతోంది. ఈసారి కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికార ప్రకటన మాత్రం ఏమీ వెలువడ లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. ఆయనను గవర్నర్‌గా నియమించేసినట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
త్వరలో ఎన్నికల వేళ..?
మరో వైపు తమ అభిమాన హీరో పెద్ద నాన్నకు గవర్నర్ పదవి దక్కనుందన్న వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. బీజేపీలోనే కొనసాగుతున్నారు. 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. 2016లో రోశయ్య వెళ్లిపోయిన తర్వాత ఇప్పటి వరకూ తమిళనాడుకు గవర్నర్ నియమితం కాలేదు. రోశయ్య అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావే కొద్ది రోజుల పాటు తమిళనాడుకు కూడా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా తిరు బన్వారిలాల్ పురోహిత్ ఉన్నారు. తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందులో భాగంగానే కృష్ణంరాజును గవర్నర్‌గా పంపాలని నిర్ణయించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.