రాజ్యాంగ స్ఫూర్తికి తిలోద‌కాలు, దేశంలో అశాంతికి మూల కార‌ణాలు

భార‌త‌దేశ‌మంత‌టా అశాంతి క‌నిపిస్తోంది. ఈశాన్య రాష్ట్ర‌మైన అసోంలో ప్రారంభించిన ఎన్నార్సీ మంట‌లు దేశ‌మంత‌టా వ్యాపించాయి. నిత్యం లక్ష‌ల మంది ఆందోళ‌న‌ల్లో క‌నిపిస్తున్నారు. అన్ని మూల‌లా ఆగ్ర‌హ జ్వాల‌లు క‌నిపిస్తున్నాయి. అనేక రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు సైతం ఈ నిర‌స‌న‌ల‌కు దిగివ‌చ్చాయి. అసెంబ్లీల‌లో తీర్మానాలు చేసి సీఏఏ, ఎన్నార్సీ అమ‌లు చేసేది లేద‌ని చెబుతున్నాయి.

అస‌లు ఇలాంటి తీవ్ర ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న‌దే ప్ర‌శ్న‌. భిన్న స‌మూహాల స‌మాహార‌మైన దేశంలో అనేక త‌ర‌గ‌తులు త‌ల్ల‌డిల్లిపోవాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న్న‌దే అంద‌రం ఆలోచించాల్సిన అంశం. అత్యున్న‌త రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన రోజూ నాయ‌కుల‌ను కీర్తిస్తూ, వారి స్ఫూర్తికి తిలోద‌కాలు ఇవ్వ‌డం అస‌లు స‌మ‌స్య‌కు మూలం అనే అబిప్రాయం వినిపిస్తోంది. భార‌త రాజ్యాంగ పీఠిక‌లో పేర్కొన్న విధంగా స‌ర్వ‌స‌త్తాక‌, సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యాంగంగా ఉండాల్సిన స‌మ‌యంలో అందుకు భిన్నంగా సాగుతుండ‌డమే అస‌లు చిక్కులు తెస్తుంద‌నే వాద‌న ఉంది.

పేరుకే స‌ర్వ‌స‌త్తాక అని చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ దేశంలో ప్ర‌స్తుతం సార్వ‌భౌమ‌త్వానికే భంగం క‌లిగించే రీతిలో ప్ర‌భుత్వాల విధానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా గ‌త మూడు ద‌శాబ్దాలుగా నూత‌న ఆర్థిక విధానాల పేరుతో అమ‌లులోకి వ‌చ్చిన నాటిన నుంచి ప్ర‌భుత్వ రంగాన్ని ప్రైవేటుప‌రం చేసే ప‌రంప‌ర సాగుతోంది. త‌ద్వారా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను హార‌తిక‌ర్పూరం మాదిరి కార్పోరేట్ల‌కు దారాధ‌త్తం చేస్తున్నారు. ఒక‌ప్పుడు దేశంలో భారీ, మౌలిక ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకి నాటి పెట్టుబ‌డిదారుల వ‌ద్ద త‌గిన ఆర్థిక వ‌స‌తి లేక‌పోవ‌డంతో ప్ర‌జాధ‌నంతో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టించారు. వాటిని ఉప‌యోగించుకుని తెగ‌బ‌లిసిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ భారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను స్వాహా చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. ప్రైవేటీక‌ర‌ణ పేరుతో అన్ని రంగాల్లోనూ హ‌వా సాగిస్తున్నారు. ఇప్ప‌టికే న‌వ‌ర‌త్న ప‌రిశ్ర‌మ‌లుగా చెప్పుకునే వాటిని కూడా చేజిక్కించుకున్నారు. ఇటీవ‌ల రైల్వే, ర‌క్ష‌ణ రంగాల్లో కూడా ప్రైవేటు చొర‌బ‌డింది. దానికి మించి విదేశీ పెట్టుబ‌డులు ప్ర‌వేశించి అన్నింటా ఇప్పుడు ఆధిప‌త్యం చెలాయిస్తున్నాయి. దేశ సార్వ‌భౌమ‌త్వ‌మే ప్ర‌శ్నార్థ‌కంగా మారి ప‌రాధీన‌త పెరిగింది. అయినా రాజ్యాంగంలో స‌ర్వ‌స‌త్తాక అని చెప్పుకుంటూ సంతృప్తి ప‌డాల్సిన ద‌శ క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో సామ్య‌వాద భావ‌జాల‌మే ఇప్పుడు సంపూర్ణంగా కొర‌వ‌డింది. పాల‌కుల‌కు అది అస‌లు గిట్ట‌ని అంశంగా మారింది. చివ‌ర‌కు సంప‌ద కేంద్రీక‌ర‌ణ వేగవంతం అవుతోంది. అంద‌రి సంక్షేమం అనే మాట ప‌క్క‌కు పోయి కార్పోరేట్ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణే ప్ర‌ధానం అనేటంత వ‌ర‌కూ వ‌చ్చేసింది. అందుకు అక్సోఫామ్ నివేదిక‌లు అద్దంప‌డుతున్నాయి. దేశంలో అంద‌రూ బాగుండాల‌నే మాట పేరుకే అన్న‌ట్టుగా మారింది. 73 శాతం సంప‌ద 10శాతం మంది చేతుల్లో పోగుప‌డిన తీరు ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. సంప‌ద పోగుప‌డుతున్న తీరు కార‌ణంగా మ‌రోవైపు అస‌మాన‌త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అయినా అదేమీ ప‌ట్ట‌ని ప్ర‌భుత్వాలు వేగంగా ముందుకు వెళుతున్నాయి. చివ‌ర‌కు ఈ ఏడాది ప్ర‌త్య‌క్ష ప‌న్నుల రాబ‌డి తిరోగ‌మ‌నంలో ఉందంటే రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌డికి దారితీస్తుందో గ్ర‌హించ‌వ‌చ్చు.

లౌకిక రాజ్యాంగం అనే మాటనే కొంద‌రు జీర్ణించుకోలేని స్థితి వ‌చ్చేసింది. భిన్న‌త్వంలో ఏక‌త్వం బ‌దులుగా అన్నింటా ఆధిప‌త్యం అనే త‌త్వంతో సాగే పాల‌క‌ప‌క్షం మూలంగా ప్ర‌స్తుతం మ‌తాల సామ‌ర‌స్యం మంట‌గ‌లుస్తోంది. రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా మ‌తాల మ‌ధ్య మంట‌లు చెల‌రేగుతున్నాయి. చివ‌ర‌కు పౌర‌స‌త్వం విష‌యంలో కూడా మ‌తాల‌ను బ‌ట్టి కేటాయించే చ‌ట్టాలు రూపొందించే వ‌ర‌కూ వ‌చ్చేసింది. ఇదే ఇప్పుడు కొంద‌రికి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. అసోంలో 16వేల కోట్ల వ్య‌యంతో అమ‌లు చేసిన ఎన్నార్సీ మూలంగా 67 శాతం మంది హిందువులు కూడా త‌మ పౌర‌స‌త్వం కోల్పోయే ప్ర‌మాదం వ‌చ్చింది. అంటే మ‌తాల పేరుతో మొద‌లు పెట్టిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు దేశంలో సామాన్యులు త‌మ ఆధారాలు చూపించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అలాంటి వారంతా అనుమానాస్ప‌ద పౌరులుగా డిటెన్ష‌న్ సెంటర్ల‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ మొద‌ల‌య్యింది. అలాంటివి లేవ‌ని స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి ఢిల్లీ వేదిక నుంచి అర్థ‌స‌త్యాన్ని ప్ర‌జ‌ల ముందు బ‌హిరంగంగా చెప్ప‌డం దేశం ఎంత‌టి ప్ర‌మాద స్థితిలో ఉందో చాటుతోంది. లౌకిక‌త‌త్వాన్ని నీరుగార్చే చ‌ర్య‌ల‌తో దేశ‌స్తుల మ‌ధ్య ఇప్పుడు మ‌త విభ‌జ‌న పెరుగుతున్న తీరు ఎలాంటి ప్ర‌మాదాన్ని కొనితెస్తుందోన‌నే క‌ల‌వ‌రం అంద‌రిలో క‌నిపిస్తోంది.

ప్ర‌జాస్వామ్యం అనేది మెజార్టీవాదంగా మారుతోంది. ఎన్నిక‌ల విధానంలో ఆధిక్యం సాధిస్తే ఏం చేసినా చెల్లుబాట‌వుతుంద‌నే సంస్కృతి పెరిగింది. అధికారంలో ఉన్న‌వాళ్లు ఏం చేసినా చ‌ట్ట‌బ‌ద్ధ‌మే అనేటంత వ‌ర‌కూ వ‌చ్చేసింది. ప్ర‌జాస్వామ్యంలో అంద‌రి అభిప్రాయాలు కాకుండా ఆధిక్యంలో ఉన్న వారి మాట చెల్లుబాట‌య్యే ధోర‌ణి క‌నిపిస్తోంది. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి సంపూర్ణంగా మారిపోవ‌డంతో స‌మాజంలో అశాంతికి మూలం అవుతోంది. జ‌నాభిప్రాయాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు చేసే బ‌దులుగా తాము అనుకున్న‌ది నెర‌వేర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పాల‌కులు వ్య‌వ‌హ‌రించ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌ద్వారా రాజ్యాంగ విలువ‌లు రానురాను మంట‌గ‌లిసిపోతుంటే భార‌తీయ మౌలిక విలువ‌లు వేగంగా దిగ‌జారిపోతున్నాయి. విశ్వ‌మంతా విఖ్యాతి గాంచిన భార‌తీయ‌త‌ను ఇప్పుడు ప్ర‌పంచంలోని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి స‌త్య నాదెళ్ల వారి వంటి వారే కాకుండా దావోస్ వేదిక‌గా సోరెస్ వంటి కార్పోరేట్ దిగ్గ‌జాలు కూడా భార‌తదేశ ప‌రిణామాల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నిస్తే మ‌న ప‌రిస్థితి ఎక్క‌డికి దిగ‌జారుతుందోన‌నే క‌ల‌వ‌రం క‌ల‌గ‌డం స‌హ‌జం.

ఇలాంటి ద‌శ‌లో మ‌ళ్లీ భార‌తీయ విలువ‌లు పొంగిపోర్లాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని ప‌రిర‌క్షించుకోవ‌డానికి ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. అది కేవ‌లం పాల‌కుల ప‌ని మాత్ర‌మే అనుకోకుండా పౌరులంద‌రి క‌ర్త‌వ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. అంద‌రిలో అలాంటి రాజ్యాంగ విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ కాంక్ష ర‌గిలిన నాడే దేశంలో ప‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ద‌క్కుతుంది. మ‌ళ్లీ సుభిక్షంగా భార‌తీయ‌త‌త్వం స‌మున్న‌తంగా సాగుతుంది.

Show comments