iDreamPost
iDreamPost
ఓ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సస్ఫెండ్ అయ్యారు. సాధారణ రోజుల్లో ఇది పెద్ద విశేషం కాదు. విధి నిర్వహణలో హద్దులు మీరిన వారెవరయినా సస్ఫెండ్ అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహమ్మారి విస్తృతమవుతున్న సమయంలో విధి నిర్వహణల నుంచి ఓ వైద్యుడిని తప్పించాల్సి రావడం ప్రభుత్వానికి కూడా పెద్ద ఆసక్తి ఉండదు. అయినప్పటికీ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ ని సస్ఫెండ్ చేయడం చూస్తుంటే ఆయన ఏ స్థాయిలో వ్యవహరించారన్నది అర్థం అవుతుంది.
డాక్టర్ విధులేంటి..పరిధులేంటి
డాక్టర్ సుధాకర్ వీడియోలో చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సిబ్బందికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఏకంగా పదిహేను రోజుల పాటు ఒకే జత గ్లవ్స్ తో గడపాల్సి వస్తుందన్నది ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో ఒకటి. అసలు ఇది సాధ్యమేనా. అలాంటి పరిస్థితి ఉందా అని పరిశీలిస్తే అతిశయోక్తులకు అర్థం పర్థం ఉండవేమో అనుకోవాలి. అసలు కరోనా అనుమానితుల కోసం నర్సీపట్నంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కూడా పదిహేను రోజులు కాలేదు. అక్కడ అనుమానితులను గుర్తించి వారం కూడా కాలేదు. అయినా ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు రాజకీయ నేత తరహాలో విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక అధికారికి లేదా ఉద్యోగికి సమస్య వస్తే సంబంధిత ఉన్నతాధికారులకు పిర్యాదు చేయాలి. దాని ప్రకారం సుధాకర్ తన ఆస్పత్రి సూపరింటెండెంట్ కి, ఆ తదుపరి అనకాపల్లిలో ఉండే డీసీహెచ్ఎస్ కి, వాళ్లు కూడా స్పందించని పక్షంలో జిల్లా కలెక్టర్ కి , చివరిగా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు తన వాదన వినిపించాలి. కానీ డాక్టర్ సుధాకర్ తన పరిధిలో ఉన్న అవకాశాలను వదిలేసి కేవలం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయాలనే రాజకీయ లక్ష్యాలతోనే వ్యవహరించారని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తగ్గట్టుగా వ్యవహరించారు. నేరుగా మీడియా ముందుకు వచ్చి, క్లిష్ట సమయంలో వైద్యుల మానసిక స్థైర్యం దెబ్బతీయడం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల, వైద్య సేవల పట్ల అపోహలు పెంచేలా ప్రవర్తించారు.
ప్రభుత్వ చర్యలు ఏమేరకు
డాక్టర్ సుధాకర్ పై సస్ఫెన్సన్ వేటు వేయడమే కాకుండా పోలీసు కేసు కూడా నమోదయ్యింది. దానికి ప్రధాన కారణం విధులను మరచి, పరిధులు దాటి ప్రవర్తించడమేనని స్పష్టం అవుతోంది. సహజంగా అత్యవసర సమయంలో వైద్యుల మీద చర్యలే అనూహ్యం అనుకుంటే ఏకంగా పోలీస్ కేసు కూడా నమోదయిన ఈ కేసు రాజకీయంగా సంచలనం అయ్యింది.ఇప్పటికే ఓ వర్గం మీడియాలో సుధాకర్ పై సానుభూతి పెంచేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే అది సుధాకర్ మీద ప్రేమతో కాదు..ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే అన్నది సుస్పష్టం. సుధాకర్ సస్ఫెన్షన్ వ్యవహారం పై చంద్రబాబు సహా ఆయా మీడియా సంస్థలు ఆఘమేఘాల మీద స్పందించాయి.
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా చికిత్సకు అనేక సమస్యలున్నాయి. ఆఖరికి అమెరికాలోనే మందులు లేక చైనా, ఇండియా మీద ఆధారపడే పరస్థితి వచ్చింది. ఒక్కసారిగా ఊహించని రీతిలో విరుచుకుపడిన మహమ్మారి కారణంగా కేంద్రం కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం సొంతంగా పీపీఈలు, టెస్టింగ్ కిట్లు , చివరకు వెంటిలేటర్లు సిద్ధం చేసుకునే పనిలో ఉంది. కొంత ఫలితాలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించి ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయాలనే చూసే యత్నం వైద్యుడు వ్యక్తిగా చేసినా, లేక ఆరోపణలు ఉన్నట్టు టీడీపీ ప్రోద్భలంతో జరిగినా అది ప్రజలకే చేటు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యం మినహా మరో దారి లేదు. అలాంటి సమయంలో వైద్యుల మీద నమ్మకం లేకుండా చేయాలని చూస్తే అది జనాలకే నష్టం తెస్తుందనే విషయం మరచి ఇలాంటి ప్రయత్నాలు సాగినట్టు కనిపిస్తోంది.
రాజకీయ లక్ష్యాలతో లొల్లి..
విపత్కర పరిస్థితుల్లో రాజకీయ లక్ష్యాలతో చిన్న విషయాలను పెద్దవిగా చేయాలనే తపనలో కొందరు చేస్తున్న ప్రయత్నాలు సమాజానికి శ్రేయస్కరం కాదు. అపోహలు అనవసర ఆందోళనలు పెంచడమే కాదు..అందరికీ చేటు చేస్తాయి. టీడీపీ నేతలు దీనిని గ్రహించాలి. రాజకీయ కారణాలతో విమర్శలు చేయడానికి వైద్య సేవల మీద దుమారం రేపే ప్రయత్నం చేయడం వారికి తగదన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్దం అని తెలుసుకోవాలి. లేకుంటే ప్రజలే వాటిని గ్రహించి, మరింత దూరం పెట్టే పరిస్థితి వస్తుందనే విషయం గమనంలోఉంచుకోవాలి.