iDreamPost
iDreamPost
నిన్న రాత్రి హటాత్తుగా ఇన్స్ టాగ్రామ్ లో మెగాస్టార్ చిరంజీవి తన గుండు లుక్ తో ఫోటో పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. తన 151 సినిమాల కెరీర్ లో ఎన్నడూ లేని సాహసం చేశారేమిటని ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. కొందరు అభిమానులు అప్పటికప్పుడు దాన్ని అనుసరించేశారు కూడా. అయితే ఆయన నిజంగా గుండు చేయించుకున్నారా లేక ఇంకేదైనా మేకప్ టెక్నిక్కా అనే అనుమానం వచ్చిన వాళ్ళు లేకపోలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారమైతే ఇది ఒరిజినల్ గెటప్ కాదు. ప్రోస్తటిక్స్ పద్ధతిని ఉపయోగించి నిజంగా ఆ లుక్ వచ్చేలా చేస్తారన్న మాట. గతంలో ఈ విధానంలోనే ‘గాన్ కేష్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్ శ్వేతా త్రిపాటి ఇదే టైపులో క్యాన్సర్ పేషెంట్ గా నటించింది.
కొంచెం ఇబ్బందికరమే అయినా ఈ మెథడ్ ద్వారా లుక్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడీ అవసరం చిరంజీవికి ఎందుకొచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ పనులు జరుగుతున్న సంగతి తెలిసందే. ఒరిజినల్ వెర్షన్ లో అజిత్ కు సన్నని మొలకల్లాంటి జుట్టు ఉంటుంది. సినిమా విజయంలో అది కీలక పాత్ర పోషించింది కూడా . ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు . మరి చిరుకి అది ఎలా ఉంటుందన్న టెస్ట్ ఫోటో షూట్ కోసం ఇలా ప్లాన్ చేశారన్న మాట. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే గుండు చేయించే పరిస్థితి లేదు. ఎంత వేగంగా జుట్టు పెరిగినా అసలు స్టైల్ లోకి రావడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది.
ఆచార్య షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. మూడు పాటలు షూట్ చేయాల్సి ఉంది. అలాంటప్పుడు ఇలా రిస్క్ ఎందుకు చేస్తారు. ఒకవేళ అది పూర్తయ్యి ఉంటే అప్పుడు నమ్మొచ్చు. పైగా మధ్యలో లూసిఫర్ రీమేక్ కూడా ఉంది. దానికి దట్టమైన బారెడు జుట్టు కావాలి. ఇవన్నీ చూసుకుంటే చిరు గుండు నిజం కాదనే అర్థమవుతుంది. ఒకవేళ లేదూ అంత పనీ చేశారు అనుకుంటే ఇంకొద్దిరోజుల్లో ఎలాగూ ఎవరో ఒకరిని కలిసిన ఫోటోలు బయటికి వస్తాయి. అప్పుడు క్లారిటీగా తెలిసిపోతుంది. ఏది ఏమైనా శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా చిరుకు కూడా ఈ గుండు లుక్ సూపర్బ్ గా కుదిరిందని ఫ్యాన్స్ కితాబిస్తోంటే ట్రాలింగ్ చేస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు లెండి.