iDreamPost
android-app
ios-app

15 రోజుల అనంత‌రం ఆ దేశాల్లో మ‌న‌శ్శాంతి

15 రోజుల అనంత‌రం ఆ దేశాల్లో మ‌న‌శ్శాంతి

గాజాలో ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ల మ‌ధ్య బీక‌ర దాడులు.. బాంబులు, రాకెట్ల‌తో విధ్వంసం.. పాలస్తీనా మిలిటెంట్లు 1,000కి పైగా రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ చెబుతుంటే, ఇజ్రాయెల్ కూడా వైమానిక దళాలతో వందల సంఖ్యలో బాంబు ల దాడి చేసింద‌ని పాల‌స్తీనా పేర్కొంటోంది. దాడులు, విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌ల‌తో కొన్ని రోజుల పాటు ప్ర‌జ‌లు భ‌యం భ‌యంగా గ‌డిపారు. మ‌రో యుద్ధం త‌ప్ప‌దేమోన‌న్న అనుమానాలు ప్ర‌పంచం అంతా వ్య‌క్తం అయ్యాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రిక‌లు, పెద్ద‌న్న అమెరికా సూచ‌న‌ల‌తో ప్ర‌స్తుతం అక్క‌డ శాంతి ఏర్ప‌డ‌డంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇజ్రాయిల్‌తో పాల‌స్తీనా మిలిటెంట్ సంస్థ హ‌మాస్ మ‌ధ్య కుదిరిన కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందం అమ‌లులోకి రావ‌డం ఊర‌టనిచ్చింది.

గాజా వ‌ద్ద రాకెట్లు, మోర్టార్ల దాడులు ఆగిపోయాయి. భార‌త కాల‌మాన ప్ర‌కారం గ‌త గురువారం అర్ధ‌రాత్రి నుంచి ఒప్పందం ప్ర‌కారం ఆంక్ష‌లు అమ‌లులోకి రావ‌డంతో మూడు రోజులుగా యుద్ధ వాతావ‌ర‌ణం స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇజ్రాయిల్‌, హ‌మాస్ దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 240 మంది మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది. గాజా న‌గ‌రంలోనే ఎక్కువ మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. హ‌మాస్‌తో సంధి కుదిరిన వెంట‌నే పాల‌స్తీనియ‌న్లు గాజా వీధుల్లో చేరి సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అయితే తాజాగా జ‌రిగిన హింసాత్మ‌క యుద్ధంలో తామే విజ‌యం సాధించామ‌ని ఇజ్రాయిల్‌, హ‌మాస్‌లు ప్ర‌క‌టించుకున్నాయి.

కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ద్వారా ఆ ప్రాంతంలో పురోగ‌తికి నిజ‌మైన అవ‌కాశం వ‌చ్చింద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తెలిపారు. ఒప్పందానికి కేవ‌లం కొన్ని గంట‌ల ముందు కూడా ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు సుమారు వంద క‌న్నా ఎక్కువ సార్లు గాజాలోని హ‌మాస్ కేంద్రాల‌పై వైమానిక దాడులు చేశాయి. దానికి ప్ర‌తీకారంగా హ‌మాస్ కూడా రాకెట్ల‌తో దాడి చేసింది. మే 10వ తేదీన జెరుస‌లామ్‌లోని అల్ మ‌క్సా మ‌సీదు వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న‌తో గాజాలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. దీంతో పాల‌స్తీనా, ఇజ్రాయిల్ మ‌ధ్య భీక‌ర పోరు సాగింది. యూదులు, అర‌బ్బు ముస్లింలు వీధుల్లోనూ కొట్టుకున్నారు. అల్ అక్సా మ‌సీదు వ‌ద్ద ఇజ్రాయిల్ ద‌ళాలు ముస్లింల‌ను చెద‌రగొట్ట‌డంతో.. హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. దాడి, ప్ర‌తిదాడుల్లో మొత్తం 232 మంది మ‌ర‌ణించారు. దాంట్లో 100 మందికిపైగా మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. గాజాలో 150 మంది మిలిటెంట్లు చ‌నిపోయిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. కానీ హ‌మాస్ మాత్రం దీన్ని ద్రువీక‌రించ‌లేదు.

Also Read : బాబు, కేసీఆర్‌ మధ్య ఏం ఒప్పందం జరిగింది..?