iDreamPost
android-app
ios-app

టీటీడీని టార్గెట్ చేయటం తెరువెనుక కథ ఇదే

  • Published Aug 14, 2021 | 6:07 AM Updated Updated Aug 14, 2021 | 6:07 AM
టీటీడీని టార్గెట్ చేయటం తెరువెనుక కథ ఇదే

గడిచిన రెండున్నరేళ్లుగా కొందరికి టీటీడీ టార్గెట్ గా మారింది. ఏపీలో మతోన్మాదం పెంచాలనే ఆతృతలో కొన్ని శక్తులు కాచుకుని కార్చుకున్నాయి. అదే సమయంలో తమ గిట్టని ప్రభుత్వాలను బద్నాం చేసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. అంతా కలిసి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద గురిపెట్టారు. ఎక్కువ మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశాలలో అర్థసత్యాలను ప్రసారం చేస్తూ అందరినీ వంచించేయత్నం చేస్తున్నారు. టీటీడీలో జూన్ 2019 నుంచి మొదలయిన పరిణామాలు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. తాజాగా 18 మంది టీడీపీ, జనసేన సహా వివిధ పార్టీలకు చెందిన వారి మీద నమోదయిన కేసు దానిని నిరూపిస్తోంది.

తిరుమల కొండల్లో శిలువ ఉందని ఓ కరెంట్ పోల్ ఫోటోని వక్రీకరించి కథలు అల్లారు. తీరా చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్యోగులే ఇలాంటి అపోహలు సృష్టించినట్టు తేలడంతో వారు అరెస్ట్ కూడా అయ్యారు. ఆతర్వాత తిరుమల టికెట్లపై జరూసలెం యాత్ర ప్రచారం అంటూ మరో అర్థసత్యాన్ని ముందుకు తెచ్చారు. వాస్తవాల్లోకి వెళితే చంద్రబాబు సీఎంగా ఉన్న నెల్లూరు బస్సు డిపోలో ముద్రించిన టికెట్లుగా రుజువయ్యింది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా నియమితులయిన వైవీ సుబ్బారెడ్డి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన హిందువు కాదంటూ కూడా వక్రభాష్యాలు సిద్ధం చేశారు. అవి కూడా నిజాలు కావని స్పష్టమయ్యింది.

టీటీడీ ప్రచురించే పుస్తకాల్లో అపప్రద దొర్లిందని హడావిడి చేశారు. ఎస్వీబీసీ చానెల్ లో పనిచేసే కొందరు సిబ్బంది నిర్వాహకంతో ఈమెయిల్ లో తప్పుడు సందేశాలు వెళ్లాయంటూ నానా రచ్చ చేశారు. తిరుమల టికెట్ల ధర నుంచి లడ్డూ ధర వరకూ అన్నింటి మీద భక్తులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయి. అవి నేటికీ ఆగడం లేదు. ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా టీటీడీ ని టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న 18 మందిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.

Also Read : బాలకృష్ణకు తలనొప్పిగా మారిన మాజీ ఎంపీల మధ్య గొడవ

దాని పూర్వాపరాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. టీటీడీకే తెలియకుండా టీటీడీ బంగారం తాకట్టుపెట్టేస్తున్నారనే కహానీలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే పని జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేవస్థానానికి చెందిన 1500 కేజీల బంగారాన్ని తాకట్టుపెట్టి.. ఏపీ ప్రభుత్వం అప్పుతీసుకున్నట్లు కొంత మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన ఉదంతం చూస్తూ నోరెళ్లబెట్టకమానదు. అసలు టీటీడీ బంగారం తాకట్టు పెట్టడం ఏంటీ, తాకట్టు పెడితే వచ్చే మొత్తం ఎంత, దానిని ప్రభుత్వం తీసుకోవడం ఏంటీ అనే ఆలోచన కూడా లేకుండా దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమనే రీతిలో వ్యవహరించడం విశేషంగా మారింది.

జగన్ వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా మతం కోణంలో వివాదం రాజేసే ఓ పెద్ద కుయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు పదే పదే జరుగుతున్నట్టు రూఢీ అవుతోంది. ఉద్దేశ పూర్వకంగా పదే పదే అబద్ధాలు ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. నిజానికి రాజకీయంగా జగన్ ని ఎదుర్కోలేక ఇలాంటి ఎత్తులు వేస్తున్నప్పటికీ ఆ క్రమంలో తిరుమల శ్రీవారిని కించపరచడం, ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి చర్యలకు ఉపక్రమించడం విస్మయకరంగా మారుతోంది. ఇంతటి కుట్రల వెనుక ప్రతిపక్ష పెద్దల పాత్ర ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏమయినా రాజకీయ లక్ష్యాల కోసం తిరుమలను పావుగా వాడుకోవాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పక తప్పని పరిస్థితి వస్తున్నట్టు కనిపిస్తోంది.

Also Read : నిత్యానంద ఇండియాకు వచ్చేనా?”అధీనం” పీఠాధిపతి అయ్యేనా?