iDreamPost
android-app
ios-app

సంచలనానికి ప్రయత్నించి అరెస్ట్‌ అయిన లోకేష్‌

సంచలనానికి ప్రయత్నించి అరెస్ట్‌ అయిన లోకేష్‌

సందర్భం ఏదైనా సరే వ్యక్తిగత మైలేజ్‌ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఇటీవల ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన చర్యలను గమనిస్తే అర్థమవుతోంది. ఈ ఏడాది జూన్‌లో కర్నూలు జిల్లాలో వ్యక్తిగత గొడవల నేపథ్యంలో టీడీపీ నేతలు వి నాగేశ్వరరెడ్డి, వి ప్రతాప్‌రెడ్డిలు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకని వెళ్లిన నారా లోకేష్‌ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. సినిమా సై్టల్‌లో చెప్పిన డైలాగ్‌ నారా లోకేష్‌ లక్ష్యం ఏమిటో తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసానిచ్చే మాటలు మాట్లాడాల్సిన లోకేష్‌.. మీడియా సమావేశంలో తనకు తాను సింహంతో పోల్చుకునేలా డైలాగ్‌ చెప్పారు. దీంతో అసలు విషయం కాస్త పక్కదారి పట్టి.. నారా లోకేష్‌ చెప్పిన సింహం డైలాగ్‌ ప్రాచూర్యంలోకి వచ్చింది. మీడియాతోపాటు టీడీపీ సోషల్‌ మీడియా కూడా నారా లోకేష్‌ చెప్పిన సింహం డైలాగ్‌ను ప్రచారం చేసింది. అదే సమయంలో లోకేష్‌పై సోషల్‌ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తాయి.

ఈ తరహా లక్ష్యంతో ఉన్న నారా లోకేష్‌.. తాజాగా గుంటూరులో బిటెక్‌ విద్యార్థిని రమ్య హత్య వ్యవహారంలోనూ సంచలనం సృష్టించేందుకు యత్నించారు. ప్రేమించాలని వేధిస్తున్న యువకుడు రమ్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించే పేరుతో గుంటూరు వచ్చిన నారా లోకేష్‌.. పరామర్శ అనంతరం వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. గన్‌ కన్నా జగన్‌ ముందు వస్తారన్న మాటలు ఏమయ్యాయని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శలు చేశారు. హత్యజరిగిన ప్రాంతంలో టీడీపీ శ్రేణులతో కలసి  ఆందోళనకు యత్నించారు. ప్రభుత్వంపై పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రతిగా నారా లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి విషమించకముందే.. పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. నారా లోకేష్‌ను ప్రత్తిపాడు స్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు వచ్చిన టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్రలను, వైసీపీ శ్రేణులను అక్కడ నుంచి తరలించారు.

విషయం ఏదైనా సరే ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే లోకేష్‌.. రమ్య ఘటనలోనూ అదే తీరుతో వ్యవహరించారు. వాస్తవ పరిస్థితిని పట్టించుకోకుండా విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనం. రమ్య హత్య ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. నిందితుడును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు.. సాయంత్రం కల్లా నిందితుడు శశికృష్ణను పట్టుకున్నారు. ఈ రోజు మీడియా ముందు అతన్ని నిలబెట్టి.. ఘటన తాలుకూ వివరాలను డీఐజీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. గంటల వ్యవధిలోనే నిందితుడును పట్టుకున్న విషయాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించిన తీరును పట్టించుకోని నారా లోకేష్‌.. యథావిధిగా తనకు రాసిచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం యాక్ట్‌ చేశారు. అయితే పరామర్శ పేరుతో వచ్చి రాజకీయంగా సంచలనం సృష్టించాలని యత్నించిన లోకేష్‌కు పోలీసులు అడ్డుకట్టవేశారు.

Also Read : రమ్య హత్య కేసులో వేగంగా స్పందించిన పోలీసులు, నిందితుడి అరెస్ట్