Idream media
Idream media
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి రాజధాని శివారు ప్రాంతానికి మకాం మార్చిన మాజీ ఈటల రాజేందర్ భేటీలతో బిజీగా ఉంటున్నారు. వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ అధికారులు, వైద్యులతో సమీక్షలతో బిజీగా ఉండే ఆయన ఇప్పుడు ఆయన మాజీ ఎంపీలు, నాయకులు, కార్యకర్తలను విడతల వారీగా కలుస్తున్నారు.
ప్రభుత్వం మంత్రి పదవి నుంచి భర్తరప్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్లీ కొవిడ్ కలకలం సృష్టిస్తున్న సమయంలో మళ్లీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుందని, అది సరికాదని భావిస్తూ ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, పలువురు నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా భేటీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలపై మంత్రి పదవి నుంచి ఆయనను సీఎం కేసీఆర్ భర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారన్నది ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తరలివస్తున్న ప్రముఖ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన మండలంలోని 22 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఈటలకు మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయన మేడ్చల్‌లోని ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. వారితో భవిష్యత్తు కార్యాచరణపై ఈటల వారితో చర్చించినట్లు తెలిసింది. ఎవరు బెదిరించినా భయపడకుండా మీ వెంటే ఉంటామని ఈ సందర్భంగా వారంతా ఈటలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలావుండగా, పలువురు ప్రముఖ నేతలు కూడా ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ అనిల్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్‌ను ఈటలను కలిశారు. శనివారం మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కూడా ఈటలను కలిశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పనిచేసి, పార్టీకి దూరంగా ఉంటున్న నేతలు ఈటలకు మద్దతు తెలుపుతున్నారు. తనను సంప్రదిస్తున్న నేతలతో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఏం చేస్తే బాగుంటుంది? టీఆర్‌ఎస్‌కు ఽధీటుగా కొత్త పార్టీని పెడదామా? అనే అంశాలపై సుదీర్ఘంగా ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే, ఈటలను కలిసి మద్దతు ప్రకటిస్తున్న మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు తాము ఈటలను మార్యాదపూరకంగానే కలుస్తున్నామని ప్రకటిస్తున్నారు.