వేటూరి సుందరరామమూర్తి తెలుగు చిత్రసీమకి దొరికిన పుంభావ సరస్వతి. ఆయన ఎన్ని క్లాసికల్ సాంగ్స్ రాసారో అన్ని మాస్ మసాలా పాటలు కూడా రాసారు. అంతే కాదు…ఆయనలో స్పాంటానిటీ చాలా ఎక్కువట. పాట రాయడానికి అసలు టైం తీసుకునే వారు కాదట. చాలా సందర్భాల్లో ఆశువుగా పాట మొదలుపెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇలాంటిదే ఒకటి సినిమా రంగంలో ప్రచారంలో ఉంది.
“చూడాలని ఉంది” సినిమా అందరికీ తెలిసిందే. చిరంజీవి-గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. అశ్వినిదత్ నిర్మాత. దత్ గారికి వేటూరిగారంటే మంచి గురి, చనువు కూడా.
అంతే కాదు, చాలా మంది నిర్మాతల్లా కాకుండా ఆయన క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అవుతూ తను ఖర్చుపెట్టి తీస్తున్న సినిమా ఎలా తయరావుతోందో తెలుసుకునే పాషనేట్ ప్రొడ్యూసర్.
అందుకే ఈ సినిమాలో ఒక పాట రాయడం విషయంలో వేటూరి గారిని “జగదేక వీరుడు అతిలోక సుందరి” లోని “అబ్బని తియ్యని దెబ్బా…” రేంజ్ లో ఉండాలని అడిగారట మణిశర్మ బాణీ తయారు చేసాక.
అస్సలు గ్యాప్ ఇవ్వకుండా అయితే వినండి అని అంటూ మొదటి లైన్ చెప్పేసారుట…”అబ్బబ్బ ఇద్దు అదిరేలా ముద్దు…” అని.
వినగానే దత్తుగారు నవ్వుతూ “చాలా బాగుంది” అన్నారుట.
దానికి వివరణ కూడా ఇస్తూ వేటూరి, “ఒక్క అబ్బ ఉంటేనే అబ్బనీ తియ్యని దెబ్బ అంత హిట్ అయ్యింది. ఇప్పుడు బిగినింగులోనే రెండు అబ్బలు వేసాను. ఇంకా హిట్ అవుతుంది” అన్నారట.
అది విన్న దత్తు గారు వెంటనే గట్టిగా నవ్వుతూ “ఈ పల్లవి లాక్” అని అన్నారట.
అలా లాక్ అయిన పల్లవే ఎంతో మంది శ్రోతల గుండెల్లో లాక్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యాక.
కమెర్షియల్ ప్రొడ్యూసర్ కి నచ్చే కమెర్షియల్ లైన్లు విసరడంలోనూ వేటూరి దిట్ట అని అనిపించడంలేదూ!
ఆ హిట్ సాంగ్ పుట్టుక వెనుక ఉన్న చిన్న కథ ఇది.