Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. చతికిలపడ్డ బీజేపీ, టీడీపీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ తెలుగుదేశంలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అలాగే యధావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నానుతున్నారు. చంద్రబాబు సంగతి అటుంచితే.. అనూహ్యంగా బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి ఒకరి తర్వాత మరొకరు ఏపీ సర్కారును టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు తెరచాటున ఈ తరహా ప్రయత్నాలు చేసే ఆ ఎంపీలు ఇప్పుడు నేరుగా నోరు పెంచడం ఆలోచించాల్సిన విషయమే. ఇదంతా బీజేపీ ప్లాన్ లో భాగమేనా? లేక చంద్రబాబు డైరెక్షనా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఇద్దరు ఎంపీలు కూడా బాబుకు నమ్మినబంటులుగా ముద్రపడ్డవారే.
సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. పోలీసు వ్యవస్థను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీ సర్కారును బెదిరించే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన వివరాలు తెప్పించుకోవాలంటే పార్టీ నేతల మీద మాత్రమే ఆధారపడుతుందా ? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడొచ్చు. పోలీసు శాఖలోని పరిస్థితులపై డీజీపీని వివరాలు అడుగుతారు. అన్నింటికీ మించి కేంద్రానికి గవర్నర్ ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లను రీకాల్ చేయటానికి కేంద్రానికి అధికారం ఉందనటంలో సందేహం లేదు కానీ.. అది సీఎం రమేష్ చెప్పినంత తేలికైన వ్యవహారం కాదు. అందుకు సరైన కారణాలు ఉండాలి. ఇవన్నీ రమేష్ కు తెలియవా? అయినా అలా ఎందుకు మాట్లాడారో ఆయనకే తెలియాలి.
ఇక మరో ఎంపీ సుజనా చౌదరి ఏపీ సర్కారును విమర్శించేందుకు సినిమా టికెట్ల ధరను ఎంచుకున్నారు. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని చెబుతున్నారు. వాస్తవానికి సినిమా అనేది సామాన్యుడి వినోదం. అందుకే సామాన్యులకు అనుగుణంగా ఏపీ సర్కారు టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనివల్ల థియేటర్లు మూతపడుతున్నాయని, దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
ఒకవేళ అదే నిజమైతే ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ.. ఈ అంశాన్ని రాజకీయం చేసి సర్కారును ఇబ్బంది పెట్టాలని టీడీపీ, ఇప్పుడు బీజేపీ ఎంపీ ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో పర్యటించిన సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలాతోక లేని పాలన జరుగుతోందని వచ్చే 30నెలల్లో బీజేపీ సమర్ధత ఏంటో చూపిస్తామని అన్నారు.. ఇలా సీఎం రమేశ్, సుజనా చౌదరి ఒకరి తర్వాత.. మరొకరు ఏపీ సర్కారును విమర్శించడం వెనుక అసలు లక్ష్యం ఏంటి, చేయిస్తోంది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.