రెక్క‌లు తొడిగిన భూములు

నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రాంతంలోకి వెళ్ల‌డానికి అంద‌రం భ‌య‌ప‌డ‌తాం. అదే అక్క‌డ ఎవ‌రైనా నివిసిస్తుంటే ఎంచ‌క్కా వెళ్లి అక్క‌డే మ‌నం ఉంటాం.. ఏ చిన్న వ్యాపార‌మో చేసుకుంటూ హ్యాప్పీగా బ్ర‌తికేస్తాం.. అలాంటిదే ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతోంది. రాష్ట్ర రాజ‌ధానిని మూడు భాగాలుగా చేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. ప్ర‌జ‌ల్లో ప‌రిస్థితి ఆశాజ‌నకంగా క‌నిపిస్తోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ అక్క‌డ‌కు తొంగి చూడ‌ని వారు ఇప్పుడు ప‌రుగులు తీస్తూ వెళుతున్నారు.

రాయ‌లసీమలోని క‌ర్నూలు జిల్లాలో జ్యూడిషియ‌ల్ రాజ‌ధాని పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఏ అభివృద్ధి వికేంద్రీ క‌ర‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుందో అదే క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. మూడు ప్రాంతాల్లో రాజ‌ధానులు ఉండ‌టం వల్ల అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందుతాయ‌న్న ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ఆచ‌ర‌ణ‌లో క‌నిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌ర్నూలు జిల్లాను చెప్పుకోవ‌చ్చు. ఎలాగంటే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఓ మాదిరి గిరాకీ ఉన్న భూములు ఇప్పుడు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌తో ఒక్కసారిగా ఆకాశానికెక్కేస్తున్నాయి.

క‌ర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తార‌న్న ప్ర‌క‌ట‌తో భూముల‌కు విప‌రీతంగా డిమాండ్ వ‌చ్చేసింది. నంద్యాల రోడ్డులోని ఓర్వ‌క‌ల్లు ప్రాంతంలోని భూములు మొన్నటి వరకు ఎకరం రూ.40 లక్షలు పలికేది..ఇప్పుడు రూ.70 నుంచి రూ.80 లక్షల పెరిగాయి..ఇందుకు కారణం ఓర్వకల్లు ప్రాంతంలో హై కోర్ట్ వస్తుందన్న ప్రచారం జ‌ర‌గ‌డ‌మే. ఓర్వ‌క‌ల్లులో విమాన‌శ్ర‌యం ఉండ‌టంతో పాటు ప్ర‌భుత్వ భూములు అధికంగా ఉన్నాయి. పైగా జి.ఎన్.రావ్ కమిటీ కూడా ఓర్వకల్లు వద్ద 200 ల ఎకరాల భూములు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరేట్ కి సూచించినట్లు స‌మాచారం. దీంతో హై కోర్ట్ కి సంబంధించి పర్మనెంట్ భ‌వ‌నాలు ఓర్వ‌క‌ల్లు స‌మీపంలోని ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మిస్తారన్న ప్రచారం ఊపందుకుంది

క‌ర్నూలు జిల్లాలో ప్ర‌భుత్వ భూములు చాలా ఉన్నాయి. 20వేల ఎక‌రాల ప్ర‌భుత్వ భూములు ఓర్వ‌కల్లు ప్రాంతంలో ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ ఓర్వ‌క‌ల్లులోనే విమానాశ్ర‌యం నిర్మించారు. అయితే అప్ప‌ట్లోనే ప్ర‌భుత్వ భూముల‌కు అంత గిరాకీ రాలేదు. ఇప్పుడు హైకోర్టు క‌ర్నూలుకు ఇవ్వ‌డంతో క‌చ్చితంగా ఇక్క‌డే ఏర్పాటు చేస్తారన్న ప్ర‌చారం సాగుతోంది. తాత్కాలికంగా హైకోర్టును ఎక్క‌డైనా ఏర్పాటుచేసిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో శాశ్వ‌త భ‌వ‌నాలు మాత్రం ప్ర‌భుత్వ భూములు అధికంగా ఉన్న ఓర్వ‌కల్లు ప్రాంతంలోనే ఏర్పాటుచేస్తార‌న్న ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్క‌డి భూముల‌కు విప‌రీతంగా డిమాండ్ వ‌చ్చింది. అదును దొరికితే చాలు కొనేందుకు వ్యాపార‌స్తులు సిద్ధంగా ఉన్నారు.

క‌ర్నూలు వాసులే కాకుండా రాయ‌ల‌సీమ‌, ఆంద్ర ప్రాంతాల నుంచి బ‌డా వ్యాపారులు త‌మ‌దైన శైలిలో స్థ‌లాలు, పొలాలు కొనేందుకు స్థానికంగా మ‌కాం వేశారు. రాజ‌ధానిలో త‌మ స్థ‌లం ఉంటే చాలు ఎలాగైనా అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌న్న ధోర‌ణిలో వారు ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం ఉంది. ఇప్ప‌టికే రైతుల‌తో సంప్ర‌దింపులు కూడా చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మాత్రం పంట‌లు పండే త‌మ పొలాల‌ను ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్న‌ట్లు స‌మాచారం.

Show comments