IPL2022 : బెంగుళూరు కథ మారదా?? మళ్ళీ ఇంటికే..

IPL 2022లో క్వాలిఫయర్‌-2 మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో భీకరమైన ప్రదర్శన చేసిన RCBని చూసి అంతా ఈ సారి ఏకంగా RCB కప్పు కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 7, కెప్టెన్ డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 24, లోమ్రోర్ 8, దినేశ్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 12 ఇలా అందరూ విఫలమయ్యారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో RCBకి విజయం అందించిన పటిదార్ ఒక్కడు మాత్రం హాఫ్ సెంచరీ చేసి RCB విజయం కోసం ప్రయత్నించాడు.

కానీ లక్ష్య ఛేదనలో సంజూ సేన దుమ్మురేపింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్‌ మరోసారి సెంచరీతో చెలరేగాడు. బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులు చేశాడు. 158 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రాజస్థాన్ ఫైనల్ కి చేరుకుంది.

ఇక 15 సంవత్సరాలుగా కప్పు కోసం ఎదురు చూస్తున్న RCBకి ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. RCB పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సారి కప్పు మాదే అంటూ RCB ఫ్యాన్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించేసరికి ఈ సారి కప్పు మాదే అని చాలా ఆశలు పెట్టుకున్నారు RCB ఫ్యాన్స్. అయినా ఎప్పటిలాగానే మళ్ళీ చివరి దశలో బెంగుళూరు తడబడింది.

గతంలో కూడా అనేక సార్లు ఫైనల్, ప్లేఆఫ్ వరకు వెళ్లి చివర్లో పేలవ ప్రదర్శనతో వెనక్కి వచ్చేసింది బెంగుళూరు. బెంగుళూరుకి కాస్తంత కూడా లక్కు లేదేమో అని నెటిజన్లు అంటున్నారు. RCB కథ ఈ సారి కూడా మారలేదు. దీంతో మరోసారి RCB అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే సంవత్సరమైనా బెంగుళూరు కథ మారి కప్పు కొడుతుందేమో చూడాలి అంటూ నెక్స్ట్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు బెంగుళూరు అభిమానులు.

Show comments