Idream media
Idream media
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ పుస్తకాలను తిరిగి వ్రాస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకొని ఆర్‌సిబిని రెండవ సారి ఐపీఎల్ ఫైనల్ వైపు నడిపాడు.మే 14, 2016 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉనికిలో లేని గుజరాత్ లయన్స్ బౌలర్లపై ఎబి డివిలియర్స్,విరాట్ కోహ్లీ చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్ క్రిస్ గేల్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరుకోగా, విరాట్ కోహ్లీతో ఎబి డివిలియర్స్ జత కలిశాడు. వీరిద్దరూ 16 ఓవర్‌ల పాటు బ్యాటింగ్ చేసి రెండో వికెట్‌కి 229 పరుగులు జోడించారు. గుజరాత్ లయన్స్ కు చెందిన ప్రవీణ్ కుమార్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి బౌలింగ్ దాడిని ఎదుర్కొన్న ఇరువురు బ్యాట్స్‌మన్‌లు ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ పరుగుల వరద పారించారు.
ఈ క్రమంలో ఎబి డివిలియర్స్ తన అత్యధిక ఐపిఎల్ స్కోరు 129 పరుగులను కేవలం 52 బంతులలో 12 సిక్స్‌లు,10 బౌండరీలతో సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కేవలం 55 బంతులలో 8 సిక్స్‌లు,5 బౌండరీలతో సహా 109 పరుగులు చేశాడు.ఇది విరాట్ కోహ్లీకి 3 వ ఐపిఎల్ సెంచరీ కాగా,ఈ సీజన్‌లో కోహ్లీ తన 4 ఐపిఎల్ సెంచరీలు సాధించాడు.ఐపిఎల్-2016 సీజన్‌లో అతను 81.08 సగటుతో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుపొందాడు.ఇక ఎబి డివిలియర్స్ 52.85 సగటుతో 687 పరుగులు చేశాడు.అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి తమ రెండవ అత్యధిక ఐపిఎల్ స్కోరును 248 పరుగులు చేసింది.
తర్వాత లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మన్‌ల తడబాటుతో గుజరాత్ లయన్స్ కేవలం 104 పరుగులకే చాప చుట్టేసింది.ఆర్‌సిబి బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చగా,లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ఎబి డివిలియర్స్, విరాట్ కోహ్లీ వాడిన తమ బ్యాట్,గ్లౌవ్స్, పాడ్స్ కరోనాపై పోరుకు నిధులు సమీకరించడం కోసం వేలం వేశారు.