Idream media
Idream media
క్రీడల్లో సెంటిమెంట్లకు, భావోద్వేగాలకు కొదవుండదు. క్రీడాకారులకే కాకుండా జట్ల యాజమన్యాలకు, అభిమానులకు కూడా ఇవి సహజమే. ఒక్కోసారి యాదృచ్ఛికంగా వారు నమ్మే సెంటిమెంట్లు నిజం కూడా అవుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్‌పైనే ఐపీఎల్‌లోనే రెండు జట్ల అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో సరదా ఫైట్ జరుగుతోంది. విషయమేంటంటే.. మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 12వ సీజన్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని సీజన్లలో ఒక్కసారి కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈసారి తమ జట్టులో మార్పులు చేసింది. అలాగే లోగోను మూడోసారి మార్చింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ, కొత్త దశాబ్ధం, కొత్త లోగో’’అని పేర్కొంది. సింహం బొమ్మతో కూడిన ఆ లోగో.. ధైర్యమైన జట్టు వ్యక్తిత్వాన్ని చాటుతుందని పేర్కొంది.
ఇప్పుడు తాజాగా రాయల్ చాలెంజర్స్ ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరదా కౌంటర్ వేసింది. ‘‘ఈసారి లోగా చాలా బాగుంది. ఆరెంజ్ ఆర్మీ బోల్డ్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉంది’’ అంటూ డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోల ఫోటోను పోస్ చేసింది. దీనికి అభిమానులు గతాన్ని గుర్తు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో 2009లో ఆర్సీబీ లోగో మార్చగా.. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 2016లో మళ్లీ లోగో మార్చగా పేరు మార్చుకున్న సన్‌రైజర్స్ గెలిచింది. ఈ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈసారి 2020లో కూడా ఆర్సీబీ లోగో మార్చింది కాబట్టి విజయం మాదేనని సన్‌రైజర్స్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇది ఈజీ కాదని, తమ జట్టు ఈసారి ట్రోఫీ గెలిచితీరుతుందని రాయల్ చాలెంజర్స్ అభిమానులు చెబుతున్నారు. చూద్దాం ఎవరి నమ్మకం గెలుస్తోందో…!!!