Dharani
Dharani
ప్రస్తుత కాలంలో బ్యాంక్‌ల నుంచి లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక లెక్కలేనన్ని లోన్ యాప్‌లు పుట్టుకురావడమే కాక.. రుణం ఇస్తామంటూ స్వయంగా సదరు బ్యాంక్‌లే కాల్ చేయడం, ఆ తర్వాత ఈఎంఐ కట్టకపోతే.. ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. సిబిల్ స్కోర్ నార్మల్‌గా ఉంటే.. లోన్, క్రెడిట్ కార్డులు పొందడం చాలా ఈజీ. కానీ త్వరలోనే ఆర్‌బీఐ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు వస్తే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు తీసుకోవడం కష్టతరం కానుంది. లోన్, క్రెడిట్ కార్డులు మంజూరి విషయంలో.. కస్టమర్ల బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ మరింత కఠినతరం కానుంది. ఆ వివరాలు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసురక్షిత రిటైల్ లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసే ముందు కస్టమర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్లను మరింత కఠినతరం చేయాలని బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. అసురక్షిత రుణాలలో, బ్యాంకుల వద్ద ఏదీ తాకట్టు పెట్టుకోరు. కానీ ఇతర రుణాల కంటే వారి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలంలో.. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని, దీంతో అసురక్షిత రుణాలు ముంచుకొచ్చే ప్రమాదముందని ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరించింది.
ఇప్పటికే డిఫాల్టర్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అసురక్షిత పోర్ట్‌ఫోలియోను అరికట్టేందుకు.. చర్యలు తీసుకుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాల ట్రెండ్ వేగంగా పెరిగింది. గణాంకాల ప్రకారం, 2022 సంవత్సరంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య 7.8 కోట్ల నుంచి 9.9 కోట్లకు పెరిగినట్లు తెలుసస్తోంది. అదేవిధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా 28 శాతం పెరిగి రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది అని ఆర్‌బీఐ వెల్లడించింది. అంతకుముందు ఇది 1.3 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇక 2023లో కూడా అసురక్షిత రుణాల మంజూరీ వేగంగా పెరుగుతోంది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2022తో పోల్చితే, ఫిబ్రవరి 2023లో వ్యక్తిగత రుణాలు రూ.33 లక్షల కోట్ల నుంచి రూ.40 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అందులో 20.4 శాతం మేర పెరుగుదల కనిపించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్ల మధ్య అసురక్షిత క్రెడిట్ వృద్ధి ఆందోళన కలిగించే విషయమని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. వీటిని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ నియమాలను కఠినతరం చేయనుంది.