iDreamPost
iDreamPost
జనసేన తరపున మొన్నటి ఎన్నికల్లో రాజోలులో గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ అసలు పార్టీలోనే ఉన్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో జనసేన తరపున అక్కడక్కడ కొందరు పార్టీ నేతలు జనాలకు నిత్యావసరాలను పంచుతున్నారు. చివరకు రాజోలులో కూడా ఇంటిపల్లి ఆనందరాజ్ అనే చోటా నేత జనాలకు నిత్యావసరాలను పంపిణీ చేశాడు. ఆ ఫొటోను జనసేన పార్టీ ట్విట్టర్లో కూడా ప్రముఖంగా హైలైట్ చేసింది. కానీ రాపాక మాత్రం ఎక్కడా కనబడటం లేదు.
ఇపుడే కాదు పార్టీ తరపున నిర్వహిస్తున్న ఏ కార్యక్రమాల్లో కూడా ఎంఎల్ఏ కనబడటం లేదు. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో కూడా రాపాక నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు ఎక్కడా సమాచారం లేదు. నిజానికి పార్టీ అధినేత పవనే ఎక్కడా తిరగటం లేదు. మొన్నటి వరకు సినిమా షూటింగుల్లో బిజీగా గడిపేశాడు. అకాస్మత్తుగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇంటికే పరిమితమైపోయాడు. చంద్రబాబునాయుడు తరహాలోనే పవన్ కూడా ట్విట్టర్లోనే కనబడుతున్నాడు. కాకపోతే చంద్రబాబు లాగ రోజు కాకుండా ఎప్పుడో ఒకసారి ట్విట్టర్ వేదికపై మెరిసి మాయమవుతుంటాడు.
మళ్ళీ రాపాక విషయానికి వస్తే అసలు ఈ ఎంఎల్ఏ జనసేనలోనే ఉన్నాడా లేడా అన్నది పవన్ కే డౌట్. ఎందుకంటే ఆ మధ్య పవన్ మీడియాతో మాట్లాడుతూ రాపాక ఏ పార్టీలో ఉన్నాడో ఆయనే చెప్పాలంటూ ఎద్దేవా చేశాడు. అయితే ఏదో సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ తాను జనసేన ఎంఎల్ఏనే అంటూ నిర్ధారణ చేశాడు. అంటే రాపాక ఇంకా జనసేనలోనే ఉన్నట్లు అనుకోవాలి. మరి అలాంటపుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు కనబడటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం ఇష్టంలేదు అందులోను అధినేతతో గ్యాప్ వచ్చింది కాబట్టే కనబడటం లేదంటే అర్ధముంది.
సరే మిగిలిన సమయాల్లో అంటే ఏదోలే వీళ్ళ రాజకీయం ఇలాగే ఉంటుందని సర్దుకుపోదాం. కానీ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు జనాలందరూ ఇబ్బందులు పడుతుంటే ప్రజా ప్రతినిధి అయ్యుండి కూడా రాపాక జనాల్లో కనిపించకపోతే ఎలా ? తన నియోజకవర్గంలో చోటా మోటా నేతలు కూడా జనాల్లో తిరుగుతున్నపుడు స్వయానా ఎంఎల్ఏ అయ్యుండి జనాలకు కనిపించకపోవటమంటే ఏమిటర్ధం ? పవన్ కూడా పార్టీ నేతలందరినీ జనాలకు సేవలందించమని పిలుపిస్తున్నాడే కానీ రాపాక విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించటం లేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాపాక రాజకీయగురువు మాజీ ఎంఎల్ఏ అల్లూరి కృష్ణంరాజు ఈమధ్యనే వైసిపిలో చేరాడు. నియోజకవర్గానికి చివరి జనరల్ ఎంఎల్ఏగా అల్లూరినే చెప్పాలి. 2004 వరకూ జనరల్ క్యాటగిరిలో ఉన్న రాజోలు 2009 నుండి ఎస్సీ రిజర్వుడు సీటుగా మారిపోయింది. నిజానికి అల్లూరికి రాపాక మద్దతుదారుడిగా ఉండేవాడు. అలాంటిది నియోజకవర్గం ఎస్సీ అయిపోవటంతో వైఎస్సార్ తో చెప్పి అల్లూరే రాపాకకు టికెట్ ఇప్పించి గెలిపించాడు. తర్వాత రాపాక కూడా నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నాడు.
మొత్తానికి రాపాక గెలుపు వెనుక అల్లూరి కృషే ప్రధానం. అలాంటి అల్లూరి ఈమధ్యనే వైసిపిలో చేరాడు. దాంతో రాపాక కూడా ఏదోరోజు వైసిపిలోకి జంప్ చేస్తాడనే ప్రచారం ఊపందుకుంది. కారణాలు ఏవైనా రాపాకకు జనసేనతో సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే అనుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో