iDreamPost
android-app
ios-app

రవితేజకిది టెస్టింగ్ టైం

  • Published Jul 30, 2022 | 2:48 PM Updated Updated Jul 30, 2022 | 2:48 PM
రవితేజకిది టెస్టింగ్ టైం

మాస్ మహారాజాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కలిగిన రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న మొత్తం షేర్ 3 కోట్ల 50 లక్షల లోపే రావడం ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. పైగా ఇప్పుడు వచ్చిన టాక్ తో నిలదొక్కుకోవడం చాలా కష్టం. పెద్ద పోటీ లేకపోయినప్పటికీ దాన్ని వాడుకునే అవకాశం కనిపించడం లేదు. దర్శకుడు శరత్ మండవ మీద అభిమానులు బాగా గుస్సాగా ఉన్నారు. థియేటర్ దగ్గర కనిపిస్తే నిలదీస్తామని నేనింతే సినిమాలో సాయిరామ్ శంకర్ ఫోన్ లో బ్రహ్మానందంకు వార్నింగ్ ఇచ్చినట్టు ఐమ్యాక్స్ బయట రివ్యూల వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. అంతగా రామారావు ఫ్రస్ట్రేషన్ అభిమానుల్లో కనిపిస్తోంది.

నిజానికి రవితేజ తన సెలక్షన్ ని పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన టైం వచ్చింది. 2014లో ‘పవర్’తో సూపర్ హిట్ కొట్టాక తన కెరీర్ చాలా డౌన్ ఫాల్ అయ్యింది. ‘కిక్ 2’ దారుణంగా బోల్తా, కొత్తగా హంగామా చేసిన ‘బెంగాల్ టైగర్’ సైతం యావరేజ్ గానే నిలిచింది. ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చినట్టు సంబరపడితే అక్కడి నుంచి మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయ్యింది. టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీల హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్నారు. ఇవి చాలవన్నట్టు ‘డిస్కో రాజా’ సైతం ఉస్కో అనేసింది. ఎంత ఇమేజ్ ఉన్నా వరసగా ఇలా నాలుగు ఫ్లాపులు రావడం అనేది చిన్న విషయం కాదు. ‘క్రాక్’ బలమైన కంబ్యాక్ ఇచ్చిన ఆనందం ఎక్కువ సేపు మిగల్లేదు.

ఖిలాడీతో స్టోరీ మళ్ళీ రిపీట్. జనం నో అనేశారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ లిస్టులో చేరింది. అంటే మొత్తం ఎనిమిదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే రవితేజకు వచ్చిన పెద్ద హిట్లు కేవలం మూడంటే మూడు. మిగిలినవి కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. ఇంత జరిగినప్పుడు ఫ్యాన్స్ నిరాశ చెందటం సహజం. స్పీడ్ గా సినిమాలు చేయడంలో దూకుడు చూపిస్తున్న రవితేజ స్క్రిప్ట్ ల క్వాలిటీ మీద శ్రద్ధ వహించడం లేదు. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేర్ వేరయ్య మొత్తం నాలుగు సినిమాలు ఒకేసారి లైన్ లో పెట్టి బిజీగా ఉన్న రవితేజ వీటిలో కనీసం రెండు బ్లాక్ బస్టర్ సాధిస్తేనే మార్కెట్ సేఫ్ అవుతుంది. లేదంటే రిస్కులు తప్పవు మరి.