Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా విధానాలను సరళీకృతం చేసే చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి తీసుకెళ్లిన సీఎం వైఎస్ జగన్.. వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకు చేర్చారు. వలంటీర్ల ద్వారా ఫించన్ డోర్ డెలివరీ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తూ.. వృద్ధులకు ఎనలేని మేలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వలంటీర్లకు మరిన్ని బాధ్యతలను అదే సమయంలో గుర్తింపును అందించేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రేషన్‌కార్డుదారుల ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రేషన్ దుకాణం వద్దకు వెళ్లడం, సర్వర్‌పని చేయలేదనే కారణంతో గంటల తరబడి ఎదురు చూడడం, వేలిముద్రలు పడలేదనే కారణాలతో రేషన్ తిరస్కరించడం వంటి సమస్యలకు ఈ విధానంతో సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. రేషన్ డీలర్ ఇచ్చినట్లుగానే రేషన్ డోర్‌డెలివరీ వ్యవస్థలోనూ ప్రజలు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ మిషన్ విధానంలో ఎలాంటి మార్పు లేకపోయినా.. వేలి ముద్రలు పడలేదనే కారణంతో ఏ లబ్ధిదారుడికి రేషన్ అందని పరిస్థితి ఇకపై ఉండబోదు.
గ్రామాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న వారు, వృద్ధుల వేలి ముద్రలు ఈ పోస్ యంత్రంలో పడడం లేదు. అయితే అలాంటి వారికి వలంటీర్ల సహకారంతో రేషన్ పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల వేలి ముద్రలు పడని సమయంలో వారి బదులు వలంటీర్ల వేలిముద్రలు తీసుకుని పంపిణీ చేసేలా సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం లబ్ధిదారులకు ఎంతోమేలు జరుగుతోంది. రేషన్ పంపిణీ సమయంలో వలంటీర్లు అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. వలంటీర్ల వేలి ముద్రల ద్వారా రేషన్ అందుకుంటున్న లబ్ధిదారులు వారి పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు వలంటీర్లను కొనియాడుతున్నారు. పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వడమే కాదు.. ఇప్పుడు రేషన్ బియ్యం కూడా ఇస్తున్నారంటూ వలంటీర్లకు ఆశీర్వచనాలు అందిస్తున్నారు.