Krishna Kowshik
Krishna Kowshik
కష్టే ఫలి అన్న పదానికి పర్యాయ పదం ఆయన. ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేని విజేత ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనస్థత్వం ఆయన.. ఇంతకు.. ఇంత ఎలివేషన్ ఎవరి గురించి అంటే ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్‌గా సంస్థకు ఎనలేని విజయాలను అందించారు రతన్ టాటా. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిన, నిలుస్తూనే ఉన్న ఆయన మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఆయన చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకు ఆయన ఏం చేశారంటే..? రతన్ టాటాకు మూగ జీవాలు అంటే ఇష్టం అన్న సంగతి విదితమే. పలు సందర్భాల్లో కూడా వాటిపై ప్రేమను ప్రదర్శించారు కూడా.
తాజాగా మూగ జీవాలపై తన ప్రేమను మరోసారి వ్యక్త పరిచారు టాటా. ముంబయి సియాన్ ఆసుపత్రి వద్ద ఓ శునకం దొరకగా.. దీని యజమాని ఎవరో చెప్పాలంటూ స్వయంగా ఆయనే తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఓ పోస్టు చేశారు. ‘ ముంబయి సియాన్ ఆసుపత్రి వద్ద తప్పిపోయిన శునకం కనిపించింది. దీని యజమాని కానీ, గార్డియన్ కానీ అయితే reportlostdog@gmail.comకు యజమాని అని నిర్ధారించేలా ఏదైనా ఎవిడెన్స్ తో మెయిల్ చేయండి. అప్పటి వరకు ఆ శునకం మా సంరక్షణలో ఉంటుంది. చికిత్స అందిస్తున్నాం’ అంటూ పోస్టు పెట్టారు. రతన్ టాటా.. ఒక శునకం గురించి ట్వీట్ చేయడంతో.. సుమారు 11 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. టాటాను గొప్ప లెజెండ్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఆయన అలా స్పందించడం కొత్తేమీ కాదు.. గతంలో వర్షాకాలంలో కార్ల కింద శునకాలు తలదాచుకుంటాయని, వాహనదారులు జాగ్రత్త ఉండాలని సూచించిన సంగతి విది తమే.