iDreamPost
iDreamPost
అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 777 ఛార్లీ కేవలం పది రోజులకే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ దాటించేసి ఔరా అనిపించుకుంటోంది. తెలుగులో మరీ అద్భుతాలు చేయలేకపోయినా విక్రమ్ పోటీని తట్టుకుని ఉన్న తక్కువ స్క్రీన్లలోనూ డీసెంట్ బిజినెస్ తో పాటు లాభాలు వెనక్కు ఇచ్చింది. సురేష్ సంస్థ అండదండలు విరాట పర్వం కన్నా ఎక్కువగా ఈ ఛార్లీకే ఉపయోగపడ్డాయి. కర్ణాటకలో యాక్షన్ జోనర్ ను మినహాయిస్తే మిగిలిన క్యాటగిరీల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఇప్పటికీ బెంగుళూరు లాంటి నగరాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే జంతువుతో వచ్చిన ఎమోషన్ కి జనం ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది.
కర్ణాటకలో 45 కోట్లు, తమిళనాడులో 2 కోట్లు, ఏపి తెలంగాణలో కలిపి 2 కోట్ల 90 లక్షలులో రాబట్టిన 777 ఛార్లీ కేరళలో ఏకంగా 3 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం. ఓవర్సీస్ లో అదరగొట్టిన ఈ డాగ్ డ్రామా అక్కడ ఏకంగా 6 కోట్లకు దగ్గరగా వెళ్లిపోయింది. ప్రస్తుతానికి 62 కోట్ల దగ్గర కాపలా కాస్తున్న ఈ శునకం ఫైనల్ రన్ అయ్యేలోగా 80 కోట్లకు చేరొచ్చని ట్రేడ్ పండితుల అంచనా. రక్షిత్ శెట్టికి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్నప్పటికీ దానికన్నా శునకంతో ఎమోషనే జనానికి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా పెట్స్ ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు కంటతడి పెట్టకుండా బయటికి రాలేకపోతున్నారు. ఇంకో రెండు మూడు వారాలు బాక్సాఫీస్ వద్ద బలంగా ఉండేలా కనిపిస్తోంది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్లు ఉన్నా లేకపోయినా కంటెంట్ కి ప్రేక్షకులు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది. మేజర్ కూడా సక్సెస్ కావడానికి కారణం ఇదే. సాయిపల్లవి అంత ప్రమోషన్ చేసినా విరాటపర్వంకి నష్టాలు తప్పడం లేదు. అంటే సుందరం ల్యాగ్ ని జనం ఒప్పుకోలేదు. కానీ ఛార్లీలోనూ కొంత నెమ్మదితనం ఉన్నప్పటికీ ప్రయత్నంలో నిజాయితీ పబ్లిక్ ని ఆకట్టుకుంది. వందల కోట్లు రాబట్టకపోయినా బ్రేక్ ఈవెన్ ని సులభంగా దాటేసి ప్రాఫిట్స్ ఇచ్చిన ఛార్లీ ఇంకొందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. గ్రాఫిక్స్ వాడకుండా నిజంగానే కుక్కను వాడి చాలా రిస్క్ చేసిన ఛార్లీ టీమ్ దానికి తగ్గ ఫలితాన్ని అందుకుంది.