iDreamPost
android-app
ios-app

రాపూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి మృతి

రాపూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి మృతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీనియర్‌ రాజకీయ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసుల రెడ్డి మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఈ రోజు ఉదయం ఆయన తన స్వగ్రామం గూడూరులో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన.. ఆ పార్టీ తరపున సమితి ప్రెసిడెంట్‌గా, జిల్లా పరిషత్‌ ఇంఛార్జి చైర్మన్‌గా పని చేశారు. టీడీపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు.

గూడూరుకు  చెందిన శ్రీనివాసుల రెడ్డి రాజకీయంగానే కాక నిమ్మకాయల వ్యాపారిగా జిల్లా వ్యాప్తంగా సుపరిచితుడు. కాంగ్రెస్‌ పార్టీలో నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి వర్గంలో ఉండేవారు. శ్రీనివాసుల రెడ్డి ప్రోద్భలంతో గూడూరు సమితి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. సమితి అధ్యక్షులుగా గెలిచిన వారు అప్పట్లో జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నికయ్యేవారు. ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో..ఆ పదవి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేతల్లో ఒకరైన నువ్వుల వెంకటరత్నం నాయుడు వర్గానికి చెందిన చెన్నయ్యకు వరించింది. ఎల్లసిరి శ్రీనివాసుల రెడ్డికి వైస్‌ చైర్మన్‌ పదవి దక్కింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత చెన్నయ్య ఆ పార్టీలో చేరడంతో.. ఆయనపై అనర్హత వేటు పడింది. ఆ తర్వాత వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఎల్లసిరి శ్రీనివాసుల రెడ్డి జిల్లా పరిషత్‌ ఇంఛార్జి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

1994లో టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం శ్రీనివాసుల రెడ్డికి లభించింది. రాపూరులో స్థానికేతరుడైనా నిమ్మకాయల వ్యాపారిగా జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉండడం శ్రీనివాసుల రెడ్డికి కలిసి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన శ్రీనివాసుల రెడ్డి.. సీనియర్‌ ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ఓడించి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ శ్రీనివాసుల రెడ్డి పోటీ చేయగా.. రామనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

2009 ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ విజయం కోసం పని చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేశారు. ఆ ఎన్నికల తర్వాత వయస్సు రీత్యా రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు.ఈ రోజు కాలం చేశారు. చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా, రాపూరు ఎమ్మెల్యేగా పని చేసిన శ్రీనివాసుల రెడ్డి బలమైన నేతగా పేరొందారు.

Also Read : అనంత ‘పెద్దాయన’ పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి కన్నుమూత