iDreamPost
android-app
ios-app

Ranam : సోలో హీరోగా గోపిచంద్ హ్యాట్రిక్ – Nostalgia

  • Published Oct 19, 2021 | 12:24 PM Updated Updated Oct 19, 2021 | 12:24 PM
Ranam : సోలో హీరోగా గోపిచంద్ హ్యాట్రిక్ – Nostalgia

ఇమేజ్ ఉన్న హీరోతో కమర్షియల్ సినిమా తీసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి కానీ వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ కొత్తగా ఆలోచించకపోతే బాక్సాఫీస్ దగ్గర విజయం దక్కదు. రిస్క్ అనుకోకుండా కొత్తగా ఆలోచిస్తూ మాస్ కి కావలసిన అంశాలను మిస్ కాకుండా యాక్షన్ ప్లస్ కామెడీని బ్యాలన్స్ చేస్తే ఖచ్చితంగా హిట్టు కొట్టొచ్చని నిరూపించిన చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రణం. విలన్ గా వర్షం, జయం, నిజంలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న గోపీచంద్ కు హీరోగా తొలి బ్రేక్ ఈతరం ఫిలిమ్స్ నిర్మించిన ‘యజ్ఞం’తో దక్కింది. దాని తర్వాత వచ్చిన ‘ఆంధ్రుడు’ మంచి విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కానీ సీరియస్ డ్రామాలతో ఎక్కువ షేడ్స్ బయటికి తీసుకురాలేమని గుర్తించిన గోపిచంద్ కు డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా చేస్తున్న ప్రయత్నాల్లో చెప్పిన కథ బాగా నచ్చేసింది. అంతే తన మాతృ సంస్థ ఈతరం బ్యానర్ లోనే దీన్ని తీసేందుకు పోకూరి బాబురావుని ఒప్పించారు. కామ్నా జెట్మలాని హీరోయిన్ గా, మలయాళం ఆర్టిస్ట్ బిజు మీనన్(అయ్యప్పనుం కోశియుంలో పోలీస్) విలన్ గా సెట్ చేసుకున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా మరుధూరి రాజా సంభాషణలు, రమణరాజు ఛాయాగ్రహణం అందించారు. చంద్రమోహన్, అలీ, రమాప్రభ, వేణు మాధవ్, జీవా, పృథ్విరాజ్, సుమన్ శెట్టి తదితరులు ఇతర కీలక తారాగణం.

బాగా ఆకతాయిగా ఉండే కుర్రాడు చిన్న(గోపీచంద్)పల్లెటూరి నుంచి పట్నం వచ్చి కాలేజీలో చేరతాడు. మహి(కామ్నా జెట్మలాని)ని ప్రేమించి ఊరందరూ భయపడే ఆమె అన్నయ్య భగవతి(బిజు మీనన్)తో గొడవలు పెట్టుకుంటాడు. మొదట్లో ఇవి సరదాగా ఉన్నా తర్వాత కొత్త మలుపు తిరుగుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా కామెడీగా బాగా నవ్వుకునేలా మెప్పించిన అమ్మ రాజశేఖర్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ ని మిక్స్ చేసి మెప్పించిన వైనం మరో హిట్టు దక్కేలా చేసింది. మాస్ కి క్లాస్ కి కిక్కిచ్చే పాటలు. చిరంజీవి రిఫరెన్స్ తో ఓ ఫైట్, కాలేజీలో కామెడీ ఇవన్నీ బాగా పేలాయి. 2006 ఫిబ్రవరి 10 విడుదలైన రణం గోపీచంద్ హ్యాట్రిక్ హిట్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసింది

Also Read : Brindavanam : మామకు బుద్ధి చెప్పే అల్లుడి సరదా కథ – Nostalgia