Idream media
Idream media
చిన్నప్పటి నుంచి రంజాన్ అంటే చాలా ఇష్టం. రఫీ మామ ఇంటి నుంచి మటన్ బిర్యాని, సేమియా పాయసం వచ్చేది. అప్పట్లో బిర్యానీని చేయడం ముస్లింలకే వచ్చేది. మా ఇంట్లో మసాల అన్నం (పలావ్) చేసేవాళ్లు. అది కూడా బానే ఉంటుంది కానీ, బిర్యాని అంత కాదు. రఫీ వాళ్లింట్లో బిర్యాని 40 ఏళ్ల తర్వాత కూడా నాలుక మీదే ఉండేది.
ఆయన నాకంటే పదేళ్లు పెద్ద. ఎన్టీఆర్ అభిమాని. సినిమా పిచ్చి ఎక్కించింది అతనే. నేను వాళ్లింట్లోనే రోజుల తరబడి ఉండేవాన్ని. ఉర్దూ మాధుర్యం అర్థమైంది వాళ్ల వల్లే. నన్ను అక్క కొడుకుగా పరిచయం చేసేవాడు. వాళ్ల ఇంటికి వచ్చిన వాళ్లు నిజమే అనుకునేవాళ్లు. అయితే ఉర్దూలో పలకరిస్తే దొరికేపోయేవాన్ని.
రంజాన్ మరుసటి రోజు, అందరం కలిసి ఊరి బయట వన భోజనానికి వెళ్లేవాళ్లం. అక్కడ అందరూ వచ్చి కౌగలించుకునేవాళ్లు. వాళ్లలో ఎక్కువ మంది పేదవాళ్లే. కానీ విపరీతమైన సంతోషంగా ఉండేవాళ్లం.
రఫీ వాళ్లది చాలా పెద్ద కుటుంబం. ఎన్ని కష్టాలుండేవో అర్థం చేసుకునే వయసు కాదు కానీ, ఆనందాన్ని మాత్రం అర్థం చేసుకునేవాన్ని. ఒకరిపట్ల ఒకరు ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్లు. రఫీ అన్నయ్య మాలిక్‌కి నేను వీరాభిమాని. సినిమా హీరో అంత అందగాడు. గిరజాల జుత్తుని చేత్తో తడిమి , నా క్రాప్‌ని చూసి బాధపడేవాన్ని. “పెద్దయ్యాకా నీక్కూడా రింగుల క్రాప్ వస్తుంద”ని ధైర్యం చెప్పేవాడు. నా క్రాప్ రింగుల జుత్తుగా ఎప్పటికీ మారలేదు.
కాలం మనుషుల్ని విసిరేస్తుంది. తీసుకెళుతుంది. మాలిక్ చిన్నవయసులోనే చనిపోయాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అలవాటైన మందు , అవి తీరిన తర్వాత ఇంకా ఎక్కువైంది. బతకాలని ఎంత ఆశ పడినా లివర్ వ్యాధి అంగీకరించలేదు.
రంజాన్ రోజు కొన్ని వేల మంది ముస్లింలు ఊరేగింపుగా ఈద్గాకి వెళ్లి ప్రార్థనలు చేయడం ఓ అందమైన దృశ్యం.
హైదరాబాద్ వచ్చిన తర్వాత రంజాన్ ఎదురు చూపులుగా మారింది. 99లో పంజాగుట్టలో ఖాళీ స్థలంలో టేబుళ్లు, కుర్చీలు వేసి హలీం అమ్మేవాళ్లు. ఏంటో చూద్దామని తిన్నాను. పేస్టులా ఉంటే నచ్చలేదు. రెండోసారి తిన్నా. వదల్లేదు. రంజాన్ రోజుల్లో చార్మినార్ దగ్గర హలీం తినడం ఓ సరదా.
హలీం కోసమే తిరుపతి నుంచి హైదరాబాద్‌కి ఏదో ఒక సాకుతో వెళ్లిన రోజులున్నాయి. ఈ సారి రంజాన్ నిశ్శబ్దంగా వచ్చింది. 20 ఏళ్ల నుంచి హలీం రుచి చూపించకుండా వెళ్లిపోయిన రంజాన్ ఇదొక్కటే.
జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి రంజాన్ రాకూడదు.