iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌ను వీడిన రాంపూర్ నవాబుల కుటుంబం

  • Published Jan 24, 2022 | 11:56 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
కాంగ్రెస్‌ను వీడిన రాంపూర్ నవాబుల కుటుంబం

ఎన్డీయే ప్రధాన భాగస్వామి బీజేపీ మతతత్వ పార్టీ, ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న విమర్శలు కొత్తవి కావు. అదే సమయంలో కాంగ్రెస్‌ను లౌకికవాద పార్టీ అంటారు. కానీ విచిత్రంగా లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా తిరస్కరించి.. హిందూత్వ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఓ ముస్లిం యువనేత ముందుకొచ్చాడు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.రాంపూర్ జిల్లాలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నవాబ్ కాజిమ్ అలీఖాన్ కుమారుడు హైదర్ అలీఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం రాంపూర్‌లో రెండు ప్రముఖ ముస్లిం కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్య పోరును ఈ ఎన్నికల్లోనూ కొనసాగేలా చేసింది.

కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన కొద్దిరోజులకే అప్నాదళ్ లోకి

రాంపూర్ జిల్లాకు చెందిన నవాబ్ వంశీకులైన నవాబ్ కాజిమ్ అలీఖాన్ కుటుంబం తొలి నుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. ఆయన కుమారుడైన హైదర్ అలీఖాన్‌కు ఈనెల 13న ప్రకటించిన జాబితాలో సువార్ నియోజకవర్గ టికెట్ కేటాయించారు. అయితే హైదర్ ఇటీవల అనూహ్యంగా కాంగ్రెస్‌ను వీడి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన అప్నాదళ్(ఎస్)లో చేరారు. వెంటనే ఆ పార్టీ అతనికి అదే సువార్ టికెట్ ఇచ్చింది. ఈ సందర్బంగా హైదర్ మాట్లాడుతూ యూపీలో ఎన్డీయే పాలన బాగుందన్నారు. అప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ పోరాట స్ఫూర్తి నచ్చి ఆ పార్టీలో చేరానన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. కాగా హైదర్ తండ్రి నవాబ్ కాజిమ్ మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు.

ఎస్పీ నేత ఆజంఖాన్ తో వైరం

రాంపూర్ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కుటుంబంతో నవాబ్ కాజిమ్ ఖాన్ కుటుంబానికి దశాబ్దాల వైరం ఉంది. ఎన్నికల్లోనూ ఈ రెండు కుటుంబాలు తలపడుతుంటాయి. 2017 ఎన్నికల్లో ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం విజయం సాధించాడు. అయితే పోటీ చేసిన సమయానికి ఆయన వయసు 25 ఏళ్లు మించలేదంటూ అలహాబాద్ హైకోర్టు ఆయన ఎన్నికను కొట్టివేసింది. ఒక కేసులో శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన అబ్దుల్లా ఈసారి కూడా సువార్ నుంచి పోటీ చేయడం ఖాయం. దాంతో నవాబ్, ఆజం కుటుంబాలు మరోసారి ఎన్నికల గోదాలో ఢీ కొట్టనున్నాయి. కాగా ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ పలు కేసుల్లో శిక్ష పడి ఇప్పటికీ జైల్లో ఉన్నారు.

ఆజంఖాన్ మద్దతుతోనే రాంపూర్ రాణిపై జయప్రద గెలుపు

ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ మద్దతుతోనే 2004 ఎన్నికల్లో రాంపూర్ రాణిగా పేరొందిన నవాబ్ వంశీకురాలు బేగం నూరు బానో అలియాస్ మెహతాబ్ జమానీ బేగంను ఓడించి జయప్రద తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీలో చేరిన జయప్రదకు ఆ పార్టీ రాంపూర్ టికెట్ ఇచ్చింది. రాంపూర్ ప్రాంతంలో కాంగ్రెసులో ప్రముఖంగా ఉన్న నవాబ్ వంశీకులతో ఉన్న వైరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆజంఖాన్ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని జయప్రద తరపున ప్రచారం చేశారు. ఫలితంగా సిట్టింగ్ ఎంపీ హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నూరు భానో ఓటమిపాలయ్యారు.

2009 ఎన్నికల్లో కూడా జయప్రద నూర్ భానోను రెండోసారి ఓడించారు. ఈ ఎన్నికల సందర్భంగానే ఆజంఖాన్, జయప్రద మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. తన ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారని జయప్రద ఆజంఖాన్ పై ఎలక్షన్ కమిషన్ కు, పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆజంఖాన్ ను ఎస్పీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో జయప్రద రెండోసారి గెలిచారు. అనంతర కాలంలో ఆజంఖాన్ ను తిరిగి ఎస్పీలోకి చేర్చుకోగా.. జయప్రద బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరూ నేరుగా తలపడగా ఆజంఖాన్ ఎంపీగా విజయం సాధించారు.