iDreamPost
android-app
ios-app

తెలంగాణ కాంగ్రెస్ లో వలసలు ఆగేనా?బీజేపీ లోకి మరో నాయకుడు..

తెలంగాణ కాంగ్రెస్ లో వలసలు ఆగేనా?బీజేపీ లోకి మరో నాయకుడు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అప‌సోపాలు ప‌డుతోంది. ఓట‌మే త‌ప్పా విజ‌యాన్ని చ‌విచూసి ఏళ్లు గ‌డుస్తోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో సీనియ‌ర్ నేత జానారెడ్డి సైతం ఓట‌మి పాల‌య్యారు. దీంతో రాష్ట్రంలో పార్టీ భ‌విష్య‌త్ అగ‌మ్య గోచ‌రంగా మారింది. దీంతో పార్టీ నుంచి ఒక్కొక్క‌రూ పక్క‌కు త‌ప్పుకుంటున్నారు.

పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే స‌త్తా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ కు లేద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు తాజాగా మ‌రో కాంగ్రెస్ మాజీ ఎంపీ పార్టీని వీడ‌నున్నారు. ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరేందుకు హస్తం పార్టీకి చెందిన మాజీ ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు.

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తాజాగా ఈటల రాజేందర్ తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సైతం సమావేశమయ్యారు. దీంతో షాక్ తినడం కాంగ్రెష్ వంతు అయింది. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న రాథోడ్ రమేష్ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రేఖానాయక్ తో సఖ్యత లేకపోవడం కారణంగా ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడం మరోవైపు బీజేపీ బలపడుతున్న తరుణంలో రాథోడ్ రమేష్ చూపు బీజేపీ వైపు పడింది. గత కద్దికాలంగా ఈ మేరకు ఆయన సందిగ్దావస్తలో ఉన్నారు. అయితే తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి కాషాయ కండువా కప్పుకోవాలని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ డిసైడయ్యారు. ఈ మేరకు ఈటల నివాసానికి వచ్చిన తన అభిప్రాయం చెప్పగా ఆయన ఓకే చేసినట్లు సమాచారం. అనంతరం నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా ఈటల తో కలిసి 14వ తేదీనే రాథోడ్ సైతం బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.