ఇంట్లో ఉండి బోర్‌ కొడుతోందా..? అలనాటి రామాయణం మళ్లీ వచ్చేస్తోంది!

30 సంవత్సరాల కిందట దేశ ప్రజలను భక్తి సాగరంలో ముంచెత్తిన రాయాయణం సీరియర్‌ మరోసారి మన ముంగిట్లోకి రానుంది. శనివారం(మార్చి 28) నుంచి రోజూ రెండు సార్లు వీక్షకులను ఓలలాడించడానికి వచ్చేస్తోంది. కరోనా భయంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడంతో వారికి రామాయణం సీరియల్‌తో కన్నులవిందు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. ప్రజల డిమాండ్‌ మేరకు శనివారం నుంచి ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒకసారి, రాత్రి 9 గంటల నుంచి 10 గంటలకు మరోసారి రామాయణం సీరియల్‌ను నేషనల్‌ దూరదర్శన్‌ చానల్‌లో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో మధ్యలో ఎలాంటి ప్రకటనలు ఉండకుండా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

రామానంద సాగర్‌ దర్శకత్వంలో 1987 జనవరి 25న రామాయణం సీరియల్‌ ప్రారంభమైంది. 1988 జూలై 31 వరకు ఏకధాటిగా 78 ఎపిసోడ్లు సీరియర్‌ దూరదర్శన్‌లో ప్రసారమైంది. ప్రతి ఆదివారం ఈ సీరియల్‌ వచ్చే సమయానికి ప్రజలంతా ఇళ్లకే పరిమతమయ్యేవారంటే అతిశయోక్తి కాదు. టీవీలు ఉన్న ఇళ్ల వద్ద ప్రజలు క్యూ కట్టే వారు. అంతటి ఆదరణను ఈ సీరియల్‌ సొంతం చేసుకుంది. ఇండియన్‌ టెలివిజన్‌ చరిత్రలో ఆ రికార్డును ఏ సీరియల్‌ బ్రేక్‌ చేయలేకపోయింది. రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌ తదితరులు నటించారు. రాముడిగా నటించిన అరుణ్‌గోవిల్‌ అప్పట్లో ఎక్కడకు వెళ్లినా రాముడే వచ్చాడని ప్రజలు భారీ సంఖ్యలో ఆయన్ను చూసేందుకు వచ్చేవారు. తర్వాతి కాలంలో దీపికా చికిలియా ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఈమె భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.

‘రామాయణం’ సీరియల్‌కు అప్పటికీ, ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. కరోనా విజృంభించిన కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రామానంద సాగర్ దర్శకత్వంలోని రామాయణాన్ని పునః ప్రసారం చేయాలని చాలా మంది కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ల ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కేంద్రం ప్రసారం చేయడానికి అంగీకరించింది.

ఇంకెందుకు ఆసల్యం.. రామాయణ కథా సాగరంలో మునిగి ఆనందించండి.

Show comments