చంద్రబాబు వీర విధేయుడు, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పరువు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్సీ గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రమణ రంగంలోకి దిగాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్వహించింది. దీంతో ఆయన నేడు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నమ్మిన బంటుగా మిగిలి!
తెలంగాణలో టిడిపి పరిస్థితి నానాటికి దిగజారుతున్న అప్పటికీ పార్టీను ఎల్ రమణ వీడలేదు. తెలంగాణలోని కరీంనగర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన రమణ చంద్రబాబు నమ్మిన బంటుగా కాలంలోనూ టిడిపి రాష్ట్ర పగ్గాలు అందుకుని ముందుండి నడిపించారు. హేమాహేమీలు అందరూ కరీంనగర్ నుంచి వేర్వేరు పార్టీలు ముఖ్యంగా టిఆర్ఎస్ లోకి వెళ్లి పోయినప్పటికీ రమణ ఆ వైపు ఆలోచించలేదు.
మొదటి నుంచి టీడీపీ మద్దతుదారుగా క్రమక్రమంగా ఎదిగిన రమణ 1994 లో టీడీపీ తరఫున గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు. జగిత్యాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అదే సమయంలో తెలంగాణ వైపు నుంచి కీలక నేతలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ క్యాబినెట్లో హ్యాండ్లూమ్ మంత్రిగా చోటు లభించింది. చేనేత వర్గానికి చెందిన రమణ సామజిక వర్గ ముద్ర దీనికి సహాయం చేసింది. 1996లో టిడిపి లో రాజకీయ సంక్షోభం ఏర్పడి ఎన్టీఆర్ను గద్దె దించే సమయంలో రమణ చంద్రబాబు వైపే ఉన్నారు. కరీంనగర్ జిల్లా నేతలను చంద్రబాబు వైపు మళ్ళించడం లోను రమణ కీలకంగా పని చేశారు.
చంద్రబాబు చెప్పడంతో ఎంపీ గా పోటీ!
1996లో లోక్సభ ఎన్నికల్లో కీలక నేతలు అందరిని ఎంపీ లుగా పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అప్పుడప్పుడే పార్టీలు తమ చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు జాతీయస్థాయిలో టిడిపి బలం చూపించాలంటే ఎంపీలుగా ఎక్కువమందిని గెలిపించుకోవాలని భావించారు. దానిలో భాగంగా రమణ కరీంనగర్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి చొక్కారావు మీద గెలిచారు.
2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా లోనూ జగిత్యాల నుంచి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మీద 30 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2014 లో రాష్ట్ర విభజన సమయంలోనూ ఎల్.రమణ టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకుని చూడడం, అక్కడి ఈ వ్యవహారాలన్నీ తనే చక్కబెట్టడం లో మరోసారి ముందు ఉన్నారు. టిడిపి పార్టీ నానాటికీ తెలంగాణాలో దిగజారిపోతున్న, తనతో పాటు రాజకీయాలు ప్రారంభించిన నేతలంతా వేర్వేరు పార్టీలకు వెళ్లిన రమణ మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు.
రాష్ట్ర విభన తరువాత తెలంగాణా టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రబెల్లి దయాకర రావ్,తలసాని శ్రీనివాస్,తీగల కృష్ణారెడ్డి లాంటి సీనియర్లు పోటీపడిన చంద్రబాబు మాత్రం ఎల్.రమణను రాష్ట్రాధ్యక్షుడిగా నియమించారు
తాజాగా పరువు లక్ష్యం
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నాయకుడి ని పోటీ చేయించాల్సిన అవసరం గతంలో ఉండేది కాదు. పోటీ చేసేందుకు నాయకులు సైతం గతంలో ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం టీడీపీకు తెలంగాణలో పోటీ చేసేందుకు కూడా నాయకులు దొరకకపోవడంతో నే రమణ అనివార్య పరిస్థితుల్లో పోటీకి దిగాల్సి వచ్చింది అన్నది ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట.
ఇప్పటివరకు కరీంనగర్ రాజకీయాల్లో కీలకంగా ఉండే రమణ ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కనీసం పరువు నిలబెట్టే ఓట్లను సంపాదించిన టీడీపీకి సానుకూలమే. మరెవరినో ఇక్కడ నిలబెట్టి ఉన్న పరువు పోగొట్టుకునే కన్నా, సీనియర్ నాయకులను నిలబెట్టి ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్నది టీడీపీ సిద్దాంతం లా కనిపిస్తోంది.