iDreamPost
android-app
ios-app

రాజకీయ మంటరేపుతున్న న్యాయవాదుల హత్య

రాజకీయ మంటరేపుతున్న న్యాయవాదుల హత్య

రామగుండం సమీపంలో మూడు రోజుల కిందట అత్యంత దారుణంగా నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ మి అధిష్టానం పార్టీ నుంచీ సస్పెండ్ చేసింది. అలాగే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాన నిందితుడు బిట్టు శ్రీను.. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ మేనల్లుడు కావడంతో మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

అయితే ఈ హత్యలు పుట్ట మధుకర్‌కు తెలిసి జరిగాయా? లేక బిట్టు శ్రీను, కుంట శ్రీనివాస్‌ కలిసి సొంతంగా తీసుకున్న నిర్ణయమా? అనే అంశం దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ, న్యాయవాదుల హత్య కేసులో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల పాత్ర ఉండి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తుండడంతో పుట్ట మధుకర్‌ రాజకీయ భవితవ్యం ఏమి కాబోతోందనే చర్చ జిల్లాలో మొదలయింది. మొత్తంగా ఇది రాజకీయంగా కలకలం రేపుతోంది.

కలకలం రేపుతున్న ఆడియో టేప్‌

‘‘మా గుంజపడుగు గ్రామంలోని రామాలయం విషయంలో గొడవలు జరుగుతున్నాయి.. సర్పంచ్‌ సీపీకి ఫిర్యాదు చేసినా కూడా రక్షణ కల్పించడం లేదు..’’ అంటూ హత్యకు గురైన రోజునే హైకోర్టు న్యాయవాది పీవీ నాగమణి పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కుంట శ్రీను అనే వ్యక్తి 50 మందితో గుళ్లో దూరి నానా బీభత్సం చేస్తున్నాడని, ఐదుసార్లు 100 నంబర్‌కు కాల్‌ చేసినా పట్టించుకోవడం లేదని డీసీపీతో ఆమె అన్నారు. ఇక్కడ ఎవరినైనా చంపినా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. అయితే ప్రతిదీ పోలీస్‌తో కాదని, తమ ఇన్వాల్‌మెంట్‌ ఎంత ఉంటుందో చూడాలని డీసీపీ అన్నారు. సర్పంచ్‌ వచ్చి గ్రామసభ పెట్టుకుంటామంటే తాము రక్షణ కల్పిస్తామని చెప్పారు. అనంతరం కొద్దిసేపటికే ఆమెతోపాటు ఆమె భర్త వామన్‌రావు హత్యకు గురయ్యారు.

ప్రతిపక్షాల నిరసన గళం
న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనమంతరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం గుంజపడుగులో వామన్‌రావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో పోలీసులు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీగా ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. గ్రామాల్లో జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

శుక్రవారం ఆమె ములుగులో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే న్యాయవాదులకు మంచి జరుగుతుందనుకుంటే రక్షణ లేకుండా పోయిందన్నారు. అరాచకాలను ప్రశ్నిస్తే నడి రోడ్డుపై నరికేస్తారా? అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. శుక్ర వారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వామనరావు దంపతుల హత్యలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని బిజెపి నేత విజయశాంతి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలకు ఈ కేసుతో సంబంధం ఉండడంతో దీన్నొక ఆయుధంగా బిజెపి విమర్శలు ఎక్కుపెడుతొంది.