iDreamPost
iDreamPost
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఏ హీరోకైనా డెబ్యూ చాలా కీలకం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే తరహాలో మొదటి సినిమాతో వేసే ముద్ర చాలా కాలం ఉంటుంది. అలాంటిది తెరంగేట్రంతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తే అంతకన్నా కావలసింది ఇంకేమైనా ఉంటుందా. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ గా పిలవబడే రామ్ కు ఇది అనుభవమయ్యింది. దీని వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. 2005. ఫ్యామిలీ డ్రామాలో మాస్ అంశాలను మిక్స్ చేస్తూ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టైంలో వైవి ఎస్ చౌదరి పాతాళ భైరవి స్ఫూర్తితో మాడర్న్ జనరేషన్ కోసం ఓ కథను చెప్పాలని నిర్ణయించుకున్నారు. దానికాయన మొదట అనుకున్న టైటిల్ బాలరాజు.
ఈ స్టోరీ రాసుకున్నపుడు ముందు అనుకున్న హీరో అల్లు అర్జున్. గంగోత్రి అయ్యాక ఇది చేయించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పటికే ఆర్య కమిట్ మెంట్ ఉండటంతో పెండింగ్ ఉండిపోయింది. ఈలోగా స్రవంతి రవికిశోర్ ని చౌదరి కలిసినప్పుడు ఇద్దరి మధ్య రామ్ ఎంట్రీ గురించి చర్చ జరగడం, వెంటనే బాలరాజు లైన్ ని చెప్పడంతో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. రామ్ సీన్ లోకి వచ్చాడు. హీరోయిన్ గా కొత్తమ్మాయి వెతుకుతుండగా తేజ తీస్తున్న ధైర్యంలో చేస్తున్న ఇలియానాను చూసి ఆమెకు లాక్ అయ్యాడు చౌదరి. తనను మార్చాలని చూస్తున్న తేజ సైతం ఎస్ చెప్పడంతో క్యాస్టింగ్ మొత్తం సాఫీగా జరిగిపోయింది.
అనుకున్న దాని కన్నా చాలా భారీ బడ్జెట్ తో చౌదరి సినిమా నిర్మాణం చేశారు. ఇండస్ట్రీలో రిస్క్ అనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. తొలుత అనుకున్న కీరవాణి స్థానంలో సంగీత దర్శకుడిగా చక్రి లైన్లోకి వచ్చారు. అంచనాలకు మించి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. 2006 సంక్రాంతికి వెంకటేష్ లక్ష్మి, సిద్దార్థ్ చుక్కల్లో చంద్రుడు, లారెన్స్ స్టైల్ తో పోటీ పడుతూ జనవరి 11న రిలీజైన దేవదాసు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. 6 డైరెక్ట్ 11 షిఫ్టింగ్ మొత్తం 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రామ్ కు తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇలియానా డిమాండ్ మాములుగా పెరగలేదు. వైవిఎస్ ఎన్ని సినిమాలు తీసినా దేవదాస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని స్పెషల్ మూవీగా నిలిచిపోయింది