ర‌క‌ర‌కాల న‌వ్వులు

ఈ లోకంలో మ‌నిషి మాత్ర‌మే న‌వ్వ‌గ‌ల‌డు. కోతి, కుక్క న‌వ్వ‌లేవు. సింహం ఒక‌వేళ న‌వ్వినా గ‌ర్జించిన‌ట్టే ఉంటుంది. చంద్ర‌బాబు న‌వ్వ‌లేడు, న‌వ్వినా భ‌య‌మేస్తుంది. రాజ‌శేఖ‌ర‌రెడ్డి హాయిగా న‌వ్వేవాడు. భ‌రోసాగా అనిపించేది. మోదీ న‌వ్వితే సీఆర్పీ వాళ్లు దిగుతారు. సోనియాకి న‌వ్వు నిషిద్ధం. అస‌లు కాంగ్రెస్ పార్టీ న‌వ్వ‌డం మ‌రిచిపోయి చాలా కాల‌మైంది.

రాజ‌కీయ నాయ‌కుల్లో చాలా త‌క్కువ మంది న‌వ్వుతారు. వెనుక‌టికి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్ర‌స‌న్నంగా న‌వ్వేవారు. వాజ్‌పేయ్‌, అద్వానీ కూడా కాస్తా చిరున‌వ్వులు రువ్వేవాళ్లు. మురార్జీ న‌వ్వ‌గా చూసిన వాళ్లు లేరు. నీలం సంజీవ‌రెడ్డి మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉన్న వ్య‌క్తి. రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న ఆర్ట్స్ క‌ళాశాల ఉత్స‌వాల‌కి వ‌చ్చి “ఇక‌పైన నా అదృష్టం ఏమంటే అనంత‌పురం ప్ర‌జ‌ల్ని జీవితంలో ఇంకెప్పుడు ఓటు అడిగే అవ‌స‌రం రాదు” అన్నారు. అనంత‌పురంలో ఆయ‌న ఎప్పుడూ గెల‌వ‌లేదు. అదీ విష‌యం.

ఎన్టీఆర్ భోళా మ‌నిషి. న‌వ్వేవాడు. అంజ‌య్య సృష్టించినంత కామెడీ ఎవరూ సృష్టించ‌లేదు, ఇప్ప‌టికీ. రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్‌రెడ్డిల‌కు కుర్చీ ఎక్కిన‌ప్ప‌టి నుంచి స‌మ‌స్య‌లే. ఒక‌వేళ న‌వ్వినా “ఆంధ్రా వాళ్లు చూడు ఎలా న‌వ్వుతున్నారో” అని కేసీఆర్ త‌గులుకునేవాడు.

అమిత్‌షా న‌వ్వితే పాత సినిమాల్లో రాజ‌నాల న‌వ్విన‌ట్టు ఉంటుంది. ఏదో రాష్ట్రానికి మూడింద‌ని అర్థం. మ‌మ‌త‌, మాయావ‌తి ఎప్పుడూ ముఖాల‌ను మార్చుకునే ఉంటారు. జ‌య‌ల‌లిత అప్పుడ‌ప్పుడూ న‌వ్వేది. శ‌శిక‌ళ న‌వ్వేది కాదు. అందుకే జైళ్లో కూచుంది.

ప‌ళ‌నిస్వామి రాష్ట్రాన్ని న‌వ్వుల‌పాలు చేశాడు. క‌రుణానిధి న‌వ్విస్తూ మాట్లాడేవారు. MGR న‌వ్వు త‌మిళుల ఆత్మ‌విశ్వాసాన్ని పెంచేది. వీర‌ప్ప‌న్ న‌వ్వితే గంధ‌పు చెక్క‌లు మాయ‌మ‌య్యేయి.

క‌మ‌ల‌హాస‌న్, ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుని న‌వ్వ‌డం మ‌రిచిపోయారు. నిర్మ‌లాసీతారామ‌న్‌కి న‌వ్వ‌డం తెలియ‌దు, ఏడ్వ‌డం కూడా తెలియ‌దు. ఎందుకంటే ఉల్లిపాయ వాడరుకాబ‌ట్టి.

క‌ష్టాల్లో కూడా జ‌గ‌న్ న‌వ్వ‌డం మ‌రిచిపోలేదు. అదే అత‌ని విజ‌యానికి కార‌ణ‌మైంది. ముందు ముందు న‌వ్విస్తాడో ఏడిపిస్తాడో కాలం నిర్ణ‌యిస్తుంది.

Show comments