Idream media
Idream media
బొంతు రాజేశ్వరరావు వైసీపీ తరఫున రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ మాజీ ఉన్నతాధికారిని దురదృష్టం వెంటాడింది. పోటీ చేసిన రెండు సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. రాజకీయ అనుభవలేమి ఆయనకు ప్రధాన సమస్యగా మారింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారిగా పని చేసిన బొంతు రాజేశ్వరరావు సేవలను ఉపయోగించుకునే లక్ష్యంతో వైఎస్ జగన్.. ఆయన్ను పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా (పీఆర్ అండ్ ఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూస్) సలహాదారు పదవిలో నియమించారు.
ఎస్పీ సామాజికవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ శాఖ ఉన్నత పదవి అయిన ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)గా ఉద్యోగ విరమణ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో రాజేశ్వరరావుకు సన్నిహిత సంబంధం ఉండేది.
2014 అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు బొంతు రాజేశ్వరరావు పార్టీలో చేరారు. రాజోలు కో ఆర్డినేటర్‌గా ఆయన్ను సీఎం జగన్ నియమించారు. నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి రాజేశ్వరరావు సొంత మండలం. ఉన్నత విద్యావంతులను చట్టసభలకు పంపేందుకు ఆసక్తి చూపిన సీఎం వైఎస్ జగన్ 2014లో వెలగపల్లి వరప్రసాద్‌రావు, తోట చంద్రశేఖర్ వంటి వారితోపాటు బొంతుకు టిక్కెట్ ఇచ్చారు.
Also Read : “ఫ్రూటీ” కుమార్ శ్రీమతికి చైర్మన్ గిరీ !
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రాజోలు ఎస్సీ రిజర్డ్వ్ అయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలిచారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించారు. జనసేన గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం విశేషం. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక.. ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపారు. అయితే టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. కానీ టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు మద్ధతుగా పని చేశారు. టీడీపీ అభ్యర్థి 4,683 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొంతుపై విజయం సాధించారు.
2009 వరకూ రాజోలు నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజికవర్గ నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజులకే టిక్కెట్లు కేటాయించేవి. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అల్లూరి కృష్ణం రాజు విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో రాజోలు ఎస్సీ రిజర్డ్వ్ అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం కోసం పని చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు కోసం పని చేశారు.
ప్రజల్లో నిత్యం ఉండకపోవడం, రాజకీయపరమైన వ్యూహాలు అమలు చేయలేకపోవడం వంటి కారణాలతో 2019లో బొంతు రాజేశ్వరరావు కేవలం 814 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాపాక రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ వైసీపీ టిక్కెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించిన రాపాక వరప్రసాద్ తనకు టిక్కెట్ రాదని తెలియడంతో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం తృటిలో చేజారినా.. వృత్తిపరమైన అనుభవంతో పని చేయగల నామినేటెడ్ పదవి దక్కడంతో బొంతు రాజేశ్వరరావు సంతోషంగా ఉన్నారు.
Also Read : బుచ్చయ్య చౌదరి ప్రత్యర్థికి డీసీసీబీ చైర్మన్ పదవి